జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2019 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటి చేసినా.. ఓడిపోయానని తెలిపారు. ఆ సమయంలో చాలా నిర్వేదానికి..నిరాశకు గురైనట్టు చెప్పారు. అలాంటి సమయంలో తనకు వెన్నంటి ఉండి.. ధైర్యం చెప్పి.. భవిష్యత్తుపై ఆశలు చిగురించేలా చేసిన వ్యక్తి .. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడేనని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో, పార్టీని నడిపించే విధానంలో జస్టిస్ గోపాల గౌడ సూచనలను తూ.చ. తప్పకుండా పాటిస్తానని చెప్పారు.
కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న చింతామణి నగరంలో పవన్ కల్యాణ్ సోమవారం పర్యటించారు. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడ 75వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రికి భారీ స్వాగతం లభించింది. బీజేపీ నాయకులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రజల పక్షాన, ముఖ్యంగా పేదలు, రైతులు, బడుగుల పక్షాన జస్టిస్ గౌడ అనేక పర్యాయాలు తనఅభిప్రాయాలు వెల్లడించారన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న `భూసేకరణ` చట్టంలో కీలక ప్రతిపాదనలు చేయడం ద్వారా రైతులకు మేలు జరిగేలా వ్యవహరించారని తెలిపారు. ఆయన తనకు మార్గదర్శి అని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఎట్టి పరిస్థితిలోనూ.. ఆయన చెప్పిన సూత్రాలను మరిచిపోనన్నారు. కోలార్, చిక్కబళ్లాపూర్ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని.. వారికి ఏపీ నుంచి సహాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. అదేసమయంలో కర్ణాటక ప్రభుత్వంతో తమకు ఎలాంటి పేచీలు లేవని తెలిపారు.
భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు అభివృద్ధి చెందితేనే.. దేశం అభివృద్ధి చెందుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కుంకీ ఏనుగులను ఇవ్వడంలో కర్ణాటక సహకారాన్ని తాను మరిచిపోలేదన్నారు. వేలాది ఎకరాల్లో పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయని.. దీని పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చి తమకు సహకరించిందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఏపీ-కర్ణాటక ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని ముందుకు సాగాలన్నదే తన ఉద్దేశమని చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates