హైదరాబాద్‌లోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీ హిల్స్‌కు త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. అయితే.. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ కాంగ్రెస్.. అభ్యర్థి ఎంపిక విషయంలో గతంలో ఉన్న తిప్పలే పడుతోంది. ఓ నలుగురిని ఎంపిక చేయడం.. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి.. ఫైనల్ చేయించడం.. కామన్‌గా మారింది. వాస్తవానికి పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందే ఫైనల్. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా నలుగురు పేర్ల జాబితాలో పార్టీ నాయకులు అధిష్టానం కోసం పరుగులు పెట్టారు.
ఎవరా నలుగురు..
తాజాగా పార్టీ వర్గాల సమాచారం మేరకు.. బొంతు రామ్మోహన్, అంజనీకుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి,నవీన్ యాదవ్ పేర్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్టు తెలిసింది. వీరికి సంబంధించిన వివరాలు.. పార్టీలో వారు ఎప్పటి నుంచి ఉంటున్నారు. ఏయే రూపాల్లో పార్టీకి సేవలు అందిస్తున్నారు వంటి కీలక వివరాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనుంది. ఈ నలుగురు నేతల నుంచి ఒకరిని పార్టీ అధిష్టానం ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ రాష్ట్ర చీఫ్ మహేష్ గౌడ్‌లు.. ఢిల్లీ బాట పట్టారు.
ఛాన్స్ ఎవరికి?
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నలుగురి పేర్లను ఎంపిక చేసిన నేపథ్యంలో ఎవరిని పార్టీ అధిష్టానం తుదిగా ఎంపిక చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ వర్గాల అభిప్రాయం ప్రకారం.. అంజనీకుమార్‌యాదవ్, బొంతు రామ్మోహన్‌లకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంజనీ కుమార్‌కు మరిన్ని ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు.. ఆయన పేరును ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. కాగా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా సిట్టింగ్ అభ్యర్థి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఇప్పటికే ప్రకటించింది. ఆమె తరఫున సోమవారం నుంచి ప్రచారం కూడా అధికారికంగా ప్రారంభించనున్నట్టు బీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates