ఉచిత పథకాలు ప్రకటించడం తేలికే.. కానీ, వాటి అమలుకు వచ్చే సరికి మాత్రం తల ప్రాణం తోకకు వస్తోంది. తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు ఉచిత బస్సును ప్రకటించినా.. తర్వాత కాలంలో ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. మొదట్లో బాగానే ఉన్నా.. ఉచితం భారం రాబోయే రోజుల్లో సర్కా రు మెడకు గుదిబండలా మారుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వానికి కూడా షాకే తగిలింది. తమకు 360 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారంటూ.. ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి బిల్లులు పెట్టారు.
ఏపీలోనూ ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత బస్సును అందుబాటులోకి తెచ్చారు. ఆగస్టు 15ను పురస్కరించుకుని ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఇక, అప్పటి నుంచి అనేక రూపాల్లో మహిళలకు బస్సల్లో ఉచిత ప్రయాణాన్ని చేరువ చేశారు. తొలుత పల్లెవెలుగు బస్సులకు మాత్రమే పరిమితం అనుకున్నా.. తర్వాత డీలక్స్ బస్సులకు కూడా ఉచిత సేవలను అందించారు. దీంతో లెక్కకు మిక్కిలిగా ఈ బిల్లు భారం చేరుకుంది.
మహిళలకు ఆర్టీసీలో ఉచితప్రయాణమే అయినా.. ఆ టికెట్ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇలా.. ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు మొత్తం 45 రోజులకు గాను ప్రభుత్వానికి ఈ టికెట్ల బిల్లు 360 కోట్ల రూపాయలకు పైగానే చేరింది. ఇప్పుడు ఈబిల్లును తమకు చెల్లించాలని.. ఆర్టీసీ అధికారులు సర్కారుపై ఒత్తిడి పెంచారు. మరోవైపు.. ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా.. సర్కారు తక్షణమే ఆ సొమ్ములు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం టికెట్ల సొమ్ము ఇస్తే తప్ప.. తమకు వేతనాలు లేవని కూడా వారు చెబుతున్నారు.
సో.. ఇప్పటికే అనేక బిల్లులు పెండింగులో ఉన్న సర్కారుకు ఆర్టీసీ బిల్లు భారంగా మారింది. ఇక, ఈ లెక్క ప్రకారం.. మహిళలపై బాబు సర్కారు రూ.8 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని తేలింది. నిజానికి ఒక్క రోజుకు రూ.4-5 కోట్ల వరకు భారం పడుతుందని ముందుగానే అంచనా వేసుకున్నా..ఈ పరిమితి ఎప్పుడో దాటి పోయిందని అధికారులు చెబుతుండడం గమనార్హం. సో.. ఎలా చూసుకున్నాబాబుకు ఆర్టీసీ భారం రోజుకు రూ.8 కోట్ల మేరకు పడుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates