‘శీష్’ మ‌హల్‌కు ప‌రిష్కారం.. మ‌రి ‘రుషికొండ’ ప్యాలెస్ సంగ‌తేంటి?

శీష్ మ‌హ‌ల్‌(అద్దాల బంగ‌ళా).. ఈ మాట కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో జోరుగా వినిపించిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని ఆరో భ‌వంతి ఇది. అప్ప‌టి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఈ బంగ‌ళాకు.. 200 కోట్ల రూపాయల ప్ర‌జాధ‌నాన్ని వెచ్చించి.. అత్యంత ఆధునిక వ‌స‌తుల‌తో పున‌ర్నిర్మాణం చేశారు. దీనిపై బీజేపీ నేత‌లు అప్ప‌ట్లో నిప్పులు చెరిగారు. ఢిల్లీ అస‌లే అప్పుల్లో ఉంటే.. ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి.. ఆధునీక‌రించ‌డం ఎందుక‌ని నిల‌దీశారు.

అంతేకాదు.. దీనిలో అవినీతి జ‌రిగింద‌ని.. కేజ్రీవాల్ ఆయ‌న అనుంగులు సొమ్ము తిన్నార‌ని కూడా బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఇది ప్ర‌భుత్వ‌భ‌వ‌న‌మేన‌ని.. తానేమీ సొమ్ములు తిన‌లేద‌ని.. ప్ర‌భుత్వ గౌర‌వం కాపాడేందుకే.. దీనిని ఆధునీక‌రించామ‌ని అప్ప‌ట్లో కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇక‌, ఆయ‌న ప్ర‌భుత్వం ప‌డిపోయిన త‌ర్వాత‌.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. ఈ భ‌వ‌నం ఆధునీక‌ర‌ణ‌లో జ‌రిగిన అవినీతిపై ప్ర‌స్తుతం విచార‌ణ చేస్తున్నారు. మ‌రోవైపు.. నిన్న మొన్న‌టివ‌రకు సీఎం విడిది నివాసంగా వినియోగించాల‌ని భావించినా.. తాజాగా ఈ నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్నారు.

శీష్ మ‌హ‌ల్‌ను.. ప్ర‌భుత్వ గెస్ట్ హౌస్‌గా మార్చాల‌ని తీర్మానం చేశారు. దీనికి స‌ర్కారు ఆమోదం ల‌భించింది. ఇక‌, నుంచి రాష్ట్రాల‌కు చెందిన అతిథులు, కేంద్రం పెద్ద‌లు కూడా ఈ భ‌వ‌నాన్ని గెస్ట్ హౌస్‌గా వినియోగించుకునే వెసులు బాటు ఉంది. ఇదేస‌మ‌యంలో ఏపీలో వైసీపీ స‌ర్కారు హ‌యాంలో విశాఖప‌ట్నం లోని రుషికొండ‌పై రూ.450 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ప్యాలెస్‌(టీడీపీ నేత‌ల మాట‌ల్లో) ప‌రిస్థితి ఏంట‌న్నది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కూట‌మి స‌ర్కారు ఏర్పడి 15 మాసాలు అయినా.. దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.

ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ప‌ర్య‌టించి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో పెచ్చులు ఊడుతున్నాయ‌ని.. నీళ్లు కారుతున్నాయ‌ని.. ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. దీనిని ఎలా వినియోగించాల‌న్న అంశంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నామ‌న్నారు. మంత్రుల క‌మిటీని నియ‌మించి.. దేనికి వినియోగిస్తే అనువుగా ఉంటుందో తెలుసుకుంటామ‌న్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు క‌మిటీని నియ‌మించ‌లేదు. కానీ, ఢిల్లీలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. కేవ‌లం 7 మాసాలే అయినా.. అక్క‌డ శీష్ మ‌హ‌ల్‌పై నిర్న‌యం తీసుకోవ‌డం విశేషం.