యువ ఎమ్మెల్యేకు ఎఫెక్ట్‌: తీరుమార‌క‌పోతే.. ఫ్యూచ‌ర్ కొలాప్సే.. !

శ్రీకాళహస్తి నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని నిలబెడతారా? నిలబెట్టరా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఆయన వివాదాలకు కేంద్రంగా మారారు అన్నది వాస్తవం. ఈ విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. సుధీర్ రెడ్డి ఇప్పటికే రెండు మూడు విషయాల్లో వివాదాలకు కేరాఫ్ గా మారారు. మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ను ఆయన టార్గెట్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన సుధీర్ రెడ్డి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడంలేదని సంచలనం వ్యాఖ్యలు చేశారు.

తన లెటర్ హెడ్ పైనే అనేకసార్లు ఫిర్యాదు చేశానని.. లెటర్ హెడ్ పుస్తకాలు అయిపోయినా కూడా.. ఆ ఫిర్యాదు ఇంతవరకు పరిష్కారం కాలేదని చెప్పారు. దీనివల్ల తమ నియోజకవర్గంలో తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇలా అయితే ఏ విధంగా ముందుకు వెళ్లాలని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారం మంత్రి నారా లోకేష్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అయితే, ఆయన ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం సభా వేదికగానే సుధీర్ రెడ్డిని హెచ్చరించారు.

మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి చెబుతున్నారని సొంత అజెండాలు పెట్టుకోవద్దని ఆయన తీవ్రంగా మందలించారు. ఈ విషయం ప్రస్తుతం పార్టీలో అంతర్గతంగా చర్చకు కూడా దారితీసింది. అయితే దీని వల్ల ఇప్పటికిప్పుడు సుధీర్ రెడ్డికి నష్టం లేకపోయినా భవిష్యత్తులో ఆయన తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నది నాయకులు చెబుతున్న మాట. గతంలో ఆయన తండ్రి గోపాలకృష్ణారెడ్డి మంత్రి పదవులు అలంకరించారు. చంద్రబాబు దగ్గర విశ్వసనీయ నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు.

ఇప్పుడు ఆ తరహా రాజకీయాలు సుధీర్ రెడ్డి చేయాల్సి ఉందని అంటున్నారు. కానీ ఎవరు చెబుతున్నారో ఎవరి మాట వింటున్నారో తెలియదు కానీ ఆయన వేస్తున్న అడుగులు మాత్రం తప్పుదారిలో పడుతున్నాయని నాయకులు వాపోతున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా చంద్రబాబు దగ్గర విశ్వాసం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఆయన ఊహించని స్థాయిలో పదవులు దక్కుతాయని అంటున్నారు. పార్టీలోనూ ప్రాధాన్య పెరుగుతుందని చెబుతున్నారు.

లేకపోతే ఇక్కడితో ఆయన రాజకీయ ప్రస్థానం ఆగిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని జనసేన కోరింది. కానీ సుధీర్ రెడ్డి కోసం చంద్రబాబు పట్టుబట్టి ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. వచ్చే ఎన్నికల నాటికి సుధీర్ రెడ్డి పరిస్థితి కనక మారకపోతే అసలు ఎన్నికల్లో టికెట్ దక్కడం కూడా కష్టమేనన్నది అంతర్గతంగా పార్టీ నాయకులు చెబుతున్న మాట. మరి దీనిని బట్టి సుధీర్ రెడ్డి తన పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.