తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగితే.. నిజంగానే తెలంగాణకు ఒక మణిహారంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఏపీ రాజధాని అమరావతిని మించి నిర్మించాలన్న వ్యూహంతో సీఎం అడుగులు వేస్తున్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. భాగ్యనగరంలో ఇప్పటి వరకు సైబరాబాద్ వంటి మహానగరాన్ని చంద్రబాబు సృష్టించారన్న పేరుంది. సచివాలయాన్ని కేసీఆర్ కట్టించారన్న రికార్డు ఉంది.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తలకెత్తుకున్న ‘ఫ్యూచర్ సిటీ’వాటిని మించి ఉంటుందని.. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నది కాంగ్రెస్ వాదులు, సీఎం మిత్రులు చెబుతున్న మాట. ఇదిలావుంటే.. దీని సాకారం అంత ఈజీ కాదన్నది నిపుణులు చెబుతున్నమాట. ప్రస్తుత ప్రభుత్వానికి కేవలం రెండున్న రేళ్ల సమయం మాత్రమే ఉంది. అలా చూసుకుంటే.. కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. పైగా.. కేంద్రం నుంచే నిధులు రాబట్టాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. అంతేకాదు.. పెద్దగా ఆసక్తి కూడా చూపడం లేదు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ కేంద్రం కరుణించినా.. ఏపీ నుంచి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ.. దీని నుంచి వెళ్లే అనేక మార్గాలు, ముఖ్యంగా తాజాగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ హైవే.. ఏపీలో నుంచే వెళ్లాల్సి ఉంటుంది.
ఈ ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే.. తెలంగాణ పరిధిలో 40 శాతం ఉంటే. ఏపీపరిధిలో 60 శాతం ఉంటుంది. అంతేకాదు.. తెలంగాణలోని రెండు జిల్లాల్లోనే భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఏపీలో 4 జిల్లాల్లో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అలైన్‌మెంటు విషయంలోనూ తెలంగాణ చెబుతున్నట్టుగా ఏపీ అంగీకరించే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నంలోని పోర్టు వరకు నిర్మించాలని భావిస్తున్న ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్‌కు ఏపీ ప్రభుత్వం కూడా 40 శాతం మేరకు నిధులు కేటాయించాలి. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో సాకారం అయ్యేది కాదని అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. రేవంత్ కు ఆదిలోనే అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ‘బనకచర్ల’ విషయంలో తెలంగాణ వైఖరిపై గుర్రుగా ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దీనికి సహకరించడం కూడా కష్టమేనని చెబుతున్నారు. సో.. ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates