`యువ‌గ‌ళం` ఫ్రెండ్ పెళ్లి.. బిజీ షెడ్యూల్‌లోనూ హాజ‌రైన లోకేష్‌

రాజ‌కీయ నేత‌ల‌కు మిత్రులు ఉంటారా? అంటే ఎందుకు ఉండ‌రు?! అయితే.. వారిని క‌లిసేందుకు, స‌మ‌యం వెచ్చించేందుకు పెద్ద‌గా తీరిక ఉండ‌దు. పైగా.. మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆ బాధ్య‌త‌లు వేరేగా ఉంటాయి. ఇటు పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, అటు ప్ర‌భుత్వం ప‌నులు అన్నీ చూస్తూనే.. మంత్రి నారా లోకేష్‌.. త‌న యువ‌గ‌ళం ఫ్రెండ్ భ‌వ్య(అస‌లు పేరు భ‌వానీ) వివాహానికి హాజ‌ర‌య్యారు. ఈ ఆక‌స్మిక ఆగ‌నంతో ఆమె ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. నారా లోకేష్‌ను చూసి ఆనంద బాష్పాలు రాల్చారు. ఆమెను ఆశీర్వ‌దించి న నారా లోకేష్‌.. నా ఫ్రెండ్ లైప్ బాగుండాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.

ఎవ‌రీ ఫ్రెండ్‌?

వైసీపీ హ‌యాంలో నారా లోకేష్ `యువ‌గ‌ళం` పేరుతో పాద‌యాత్ర నిర్వ‌హించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేశారు. ఈ క్ర‌మంలో పాద‌యాత్ర విజ‌య‌వాడ చేరుకున్న‌ప్పుడు.. ఇక్క‌డి మొఘ‌ల్ రాజ‌పురంలో నివ‌సిస్తున్న భ‌వ్య‌.. పాద‌యాత్ర‌లో నారా లోకేష్‌ను క‌లుసుకున్నారు. ఆయ‌న‌తో కలిసి విజ‌య‌వాడలో యాత్ర ముగిసే వ‌ర‌కు పాదం క‌దిపారు. ఈ స‌మ‌యంలోనే యువ‌త ఏమ‌నుకుంటున్నారు? అప్ప‌టి వైసీపీ స‌ర్కారు నిరుద్యోగుల‌ను ఎలా మోసం చేసింద‌న్న వివ‌రాలు వెల్ల‌డించారు. నారా లోకేష్‌తో క‌లిసి టీ తాగుతూ..అనేక విష‌యాలు పంచుకున్న భ‌వ్య‌.. ఆయ‌న‌తో క‌లిసి ఫొటోలు కూడా దిగింది.

అయితే.. పాద‌యాత్ర ఘ‌ట్టం ముగిసి.. ప్ర‌భుత్వం కూడా ఏర్ప‌డింది. నారా లోకేష్‌ మంత్రి కూడా అయ్యారు. అయితే.. ఆయ‌న భ‌వ్య‌ను మ‌రిచిపోయినా.. ఆమె మాత్రం త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో నారా లోకేష్ ప‌నితీరు ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ.. అభినంద‌న‌లు తెలుపుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా శ‌నివారం ఆమె వివాహ వేడుక జ‌రిగింది. ఈ వివాహానికి రావాల‌ని.. త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని నారా లోకేష్‌కు ఆమె కార్డు పంపారు. వాస్త‌వానికి నారా లోకేష్ ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. శ‌నివారం ఉద‌యం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఆటో డ్రైవ‌ర్ల సేవ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనంత‌రం.. ఉండ‌వ‌ల్లికి వెళ్లిపోయారు.

వేరే షెడ్యూల్‌కూడా ఉంది. అయినా.. ఆ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసుకుని నారా లోకేష్‌.. భ‌వ్య వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. వాస్త‌వానికి తాను కార్డు పంపించినా.. నిరంత‌రం బిజీగా ఉండే లోకేష్ వ‌స్తాడ‌ని భ‌వ్య ఊహించ‌లేదు. కానీ, నారా లోకేష్ త‌న ఫ్రెండ్‌ను గుర్తు పెట్టుకుని శనివారం మ‌ధ్యాహ్న‌మే..  మొగల్రాజపురంలోని ఇంటికి వెళ్లి ఆమెకు కానుక‌లు అందించి ఆశీర్వ‌దించారు. ఈ హ‌ఠాత్ప‌రిణామంతో భ‌వ్య అచ్చ‌రువొందింంది. భవ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇలా.. త‌న అభిమానుల‌ను గుర్తు పెట్టుకుని మ‌రీ వారిని సంతోష ప‌ర‌చ‌డంలో నారా లోకేష్ ఇటీవ‌ల కాలంలో ముందున్నార‌నే చెప్పాలి.