ఏపీ `పారాసైట్`.. ఇచ్చి ప‌డేసిన లోకేష్‌!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చామ‌ని, 4.7 ల‌క్ష‌ల ఉద్యోగాలు కూడా క‌ల్పించామ‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రులు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో పొరుగు ఉన్న క‌ర్ణాట‌క నుంచి ఏపీపై రాజ‌కీయ దాడులు జ‌రుగుతున్నాయి. త‌మ కంపెనీల‌ను.. త‌మ రాష్ట్రంలోని వ్యాపారాల‌ను.. ఏపీ లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని క‌ర్ణాట‌క‌లోని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే కుమారుడు, క‌ర్ణాట‌క ఐటీ శాఖ‌ మంత్రి ప్రియాంక్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని పారాసైట్‌(ప‌రాన్న‌జీవి-ఇత‌రుల‌పై ఆధార‌ప‌డి జీవించే జీవి) అని వ్యాఖ్యానించారు. “దెబ్బ‌తిన్న ప్రాణులు..(రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా) బ‌ల‌మైన వాటిపై(క‌ర్ణాట‌క‌) ఆధార‌ప‌డి బ‌తుకుతాయి.“ అని ఖ‌ర్గే వ్యాఖ్యానించారు. “ఇది స‌హ‌జం. బ‌ల‌హీనంగా వ్య‌వ‌స్థ‌లు.. బ‌ల‌మైన వాటి నుంచి తీసుకుని బ‌తుకుతాయి.(అంటే క‌ర్ణాట‌క సంస్థ‌ల‌ను ఏపీ తీసుకుంటుంద‌ని) ఇది త‌ప్పుకాదు. కానీ.. ఇలా ఒక‌రిపై ఆధార‌ప‌డి జీవించే వారు ఎంత తాము బ‌ల‌ప‌డ్డామ‌ని(ఏపీకి సంస్థ‌లు వ‌స్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు) చెప్పుకొన్నా.. వాస్త‌వ బ‌లం ముందు బ‌ల‌హీనులుగానే ఉంటారు.“ అని మంత్రి ఖ‌ర్గే వ్యాఖ్యానించారు.

ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూరు జీడీపీ.. 8.5 శాతంగా ఉంద‌ని.. 2035 నాటికి ప్ర‌పంచ స్థాయిలో రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంద‌ని కూడా చెప్పారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై మంత్రి నారా లోకేష్‌.. తీవ్రంగా స్పందించారు. “దేశంలో స‌న్‌రైజ్ స్టేట్‌గా మేం ఎదుగుతున్నాం. ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చేందుకు, ఉద్యోగాల సృష్టికి ప్రతి అవకాశాన్నీ వెతుకుతున్నాం. స‌ద్వినియోగం చేసుకుంటున్నాం. రాష్ట్రాలు పెట్టుబడులు, ఉద్యోగాల కోసం పోటీపడితే, భారత్ సమృద్ధి చెందుతుందని నా నిజమైన నమ్మకం. అహంకారం సరి కాదు.“ అని ఇచ్చి ప‌డేశారు. అంతేకాదు.. పెట్టుబ‌డులు.. ఉద్యోగాల క‌ల్ప‌న వంటి విష‌యాల్లో పోటీ ప‌డాల‌ని సూచించారు.