బాబు లెక్క‌: ఏపీలో ఆదాయం ఎలా పెరిగింది?

ప్ర‌స్తుతం దేశంలో గ‌త నెల 22 నుంచి వ‌స్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ-2.0 సంస్క‌ర‌ణ‌లు అమల్లోకి వ‌చ్చాయి. త‌ద్వారా జీఎస్టీలో శ్లాబులు మారి.. ప్ర‌జ‌ల‌కు ఊర‌ట క‌లిగిస్తుంద‌ని కేంద్రం చెబుతోంది. నిత్యావ‌స‌రాల నుంచి ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల వ‌ర‌కు, చెప్పుల నుంచి దుస్తుల వ‌ర‌కు కూడా ధ‌ర‌లు త‌గ్గాయి. దీంతో ప్ర‌భుత్వాల‌కు వ‌చ్చే ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గింది. తాజా లెక్క‌ల ప్ర‌కారం.. తెలంగాణ ప్ర‌భుత్వం సుమారు 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను కోల్పోయింద‌న్న‌ది గ‌ణాంకాలు చెబుతున్న మాట‌.

దీంతో తెలంగాణ స‌ర్కారు ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతోంది. అయితే.. అటు కేంద్రం, ఇటు ఏపీ రాష్ట్రాల్లో మాత్రం జీఎస్టీ ప‌న్ను ఆదాయం పెరిగింది. గ‌త 2024, సెప్టెంబ‌రు చివ‌రితో పోల్చుకుంటే.. ఈ ఏడాది సెప్టెంబ‌రులో ఏపీకి జీఎస్టీ ఆదాయం భారీగా పెరిగింది. సుమారు ఇది 1800 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఉంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇక‌, కేంద్రానికి కూడా నిధుల రాబ‌డి పెరిగింద‌ని ఆర్థిక శాఖ పేర్కొంది. మ‌రి ఇత‌ర రాష్ట్రాల్లో ఆదాయం త‌గ్గ‌గా.. ఏపీలో ఏం జ‌రిగింది? అనేది ప్ర‌శ్న‌.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. చంద్ర‌బాబు వేసిన సంక్షేమ మంత్ర‌మేన‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ శ్లాబులు త‌గ్గుతున్న స‌మ‌యంలోనే ఏపీలో రెండు కీల‌క ప‌థ‌కాల‌ను చంద్ర‌బాబు అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. 1) త‌ల్లికి వంద‌నం. ఇది సెప్టెంబ‌రు చివ‌రి వ‌ర‌కు ఇస్తూనే ఉన్నారు. ఇక‌, 2) అన్న‌దాత సుఖీభ‌వ కింద నిధులు ఇచ్చారు. దీనికి తోడు నెల నెలా ఇస్తున్న సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు ఎలానూ ఉన్నాయి. వీటి వ‌ల్ల ప్ర‌జ‌ల చేతిలో సొమ్ములు చేసి.. విక్ర‌యాలు పెరిగాయ‌న్న‌ది నిపుణుల అభిప్రాయం.

విక్ర‌యాల ప‌రంగా చూసుకున్నా.. గ‌త సెప్టెంబ‌రు.. గ‌త 2024 సెప్టెంబ‌రు మ‌ధ్య ఇవి పెరిగాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ప్ర‌జ‌ల చేతిలో సొమ్ములు ఉండ‌డం.. వ‌రుస‌గా పండుగ‌లు రావ‌డంతో విక్ర‌యాలు పుంజుకుని.. జీఎస్టీ ఆదాయం పెరిగింద‌న్న‌ది నిపుణులు చెబుతున్న మాట‌. అందుకే.. రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం మ‌రింతగా పెరిగింద‌ని అంటున్నారు. ఇదే విధానం వ‌చ్చే మూడేళ్లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో జీఎస్టీ శ్లాబులు త‌గ్గిన‌ప్ప‌టికీ.. ఏపీకి వ‌చ్చిన ఇబ్బంది లేద‌ని అంటున్నారు.