ట్రంప్ దెబ్బ: అమెరికాలో అంబటి రాంబాబు కూతురి ప్రేమ వివాహం

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురు శ్రీజ ప్రేమ వివాహం అమెరికాలో జరిగింది. అతికొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక గుడిలో జరిగింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఒక వీడియో విడుదల చేశారు. తన కూతురు శ్రీజ అమెరికాలో ఎండోక్రైనాలజీ చదువుతోందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాస్తి హర్షను ఇష్టపడిందని ఆయన చెప్పారు. వారి ఇష్టానుసారంగా ఈ పెళ్లి జరిపించామని అన్నారు. వాస్తవానికి వారిని ఇండియాకు పిలిపించి ఘనంగా పెళ్లి చేద్దామని అనుకున్నామని, కానీ, ట్రంప్ దెబ్బకు అది కుదరలేదని తెలిపారు.

ఒకసారి ఇండియాకు వస్తే మళ్లీ ట్రంప్ అమెరికాకు రానిస్తారో లేదో తెలియని పరిస్థులున్నాయని అంబటి చమత్కరించారు. వీసా దొరక్క హర్ష తల్లిదండ్రులు ఈ వివాహానికి హాజరు కాలేదని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు వారు వీసాకు అప్లై చేసినా రిజెక్ట్ అయిందని బాధపడ్డారు. వారు లేకుండానే ఈ పెళ్లి జరగడం బాధగా ఉందని, కానీ, కొన్ని సార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవని అన్నారు. అయితే, తన కూతురు, అల్లుడు వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇండియాకు వస్తారని, అక్కడ గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తానని అన్నారు.

ఒకప్పుడు డాక్టర్ చదివిన వారు మరో డాక్టర్ నే పెళ్లి చేసుకునేవారని, కానీ, ఇప్పుడు డాక్టర్, ఇంజనీర్ కాంబినేషన్ ట్రెండ్ అవుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక, అమెరికాలో జరిగిన ఈ వివాహానికి హాజరైన తన మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ అంబటి కృతజ్ఞతలు తెలిపారు.