అమరావతి పై మలేషియా చూపు

మలేషియా దేశానికి చెందిన 12 మంది ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తోంది. ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబు మలేషియాలో పర్యటించిన సందర్భంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. రాజధానిని అద్భుతంగా నిర్మిస్తున్నామని, ప్రపంచ స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. దీంతో మలేషియా ప్రభుత్వం 12 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపింది.

అమరావతిలో పర్యటిస్తున్న మలేషియా బృందం ఇక్కడ నిర్మాణంలో ఉన్న భవన సముదాయాలను చూసి విస్మయం వ్యక్తం చేసింది. పనులు నిరంతరాయంగా సాగుతున్నాయని, రాజధాని తొలి దశను 2027 చివరి నాటికి పూర్తి చేస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ కె. కన్నబాబు వారికి వివరించారు. ఈ సందర్భంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పురోగతి, జరుగుతున్న నిర్మాణాలు, రైతులు ఇచ్చిన భూములు, ప్రతిగా ప్రభుత్వం వారికి కల్పిస్తున్న సదుపాయాలను కూడా వివరించారు.

ఆయా పనులపై మలేషియా ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల భవన సముదాయాలను నిశితంగా పరిశీలించిన మలేషియా బృందం నిర్మాణ రీతులు, డిజైన్‌ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని, రెసిడెన్షియల్ భవనాల పురోగతిని కూడా పరిశీలించింది. అనంతరం ఈ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలతో భేటీ కానుందని సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు. వీరు పెట్టే పెట్టుబడులపై త్వరలోనే స్పష్టత వస్తుందని వివరించారు.