నోరు జారే ఎమ్మెల్యేలను జిల్లాలకు చెందిన ఇంచార్జ్ మంత్రులే నియంత్రించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ఆయన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో విడివిడిగా మాట్లాడారు. ఇంచార్జ్ మంత్రిగా నియమించినప్పుడు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని తేల్చి చెప్పారు. వాటిని సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
“ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారంటే ఎవరు నియంత్రించాలి? అన్నీ నేనే చూడలేను. మీరు అన్ని విషయాలను పరిశీలించాలి. నోరు జారుతున్నారని తెలిసి కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు?” అని పలువురు మంత్రులను ఆయన ప్రశ్నించారు.
శుక్రవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం పలువురు కీలక మంత్రులతో చంద్రబాబు విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును వారితో చర్చించారు.
ప్రధానంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (వీరంతా టీడీపీవారే)లు అసెంబ్లీలో మాట్లాడిన తీరు వివాదాలకు కేంద్రంగా మారిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.
అలాంటి వారు తెలిసో తెలియకో లేదా కొందరు ఉద్దేశపూర్వకంగానో మాట్లాడినప్పుడు వారిని నియంత్రించే అధికారం, సబ్జెక్టుపై వివరణ కోరే అవకాశం జిల్లాలకు ఇంచార్జ్‌లుగా ఉన్న మంత్రులకు ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పారు.
కానీ మంత్రులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేక పోతున్న విషయం తెలుస్తోందని అన్నారు. ఏ సమస్య వచ్చినా తన వద్దకు తీసుకువస్తున్నారని, అవి చిన్నపాటి అంశాలనే విషయాన్ని గుర్తించలేక పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలోనే కాదు, బయట కూడా వివాదాలకు దిగే ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన అవసరం ఇంచార్జ్ మంత్రులుగా ఆయా జిల్లాలకు చెందిన వారికి ఉంటుందన్నారు.
ప్రస్తుతం 25 మంది మంత్రులు ఉన్నారని, రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయని, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరిని నియమించామని చంద్రబాబు తెలిపారు. వారంతా తమ తమ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వ్యవహారాలను పరిశీలించాలని సూచించారు.
ముఖ్యంగా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలపై పట్టు పెంచుకోవాలని, ఆధిపత్య రాజకీయాలు చేసేవారిని కట్టడి చేయాలని తెలిపారు.
“మీ మాట కూడా వినకపోతే నాకు వదిలి పెట్టండి. అప్పుడు వారి సంగతి నేను చూసుకుంటా. అంతేకానీ ముందుగానే నావద్దకు తీసుకురావడం వల్ల మీరు కూడా విఫలమవుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి” అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates