మోడీ రావణుడు: కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోడీ అభినవ రావణాసురుడు అని, ఆయన చేస్తున్న పనులు దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. అలాగే ఆర్‌ఎస్ఎస్ సిద్ధాంతాలకు, ఉగ్రవాద సంస్థల సిద్ధాంతాలకు పెద్ద తేడా లేదని దుయ్యబట్టింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత ఉదిత్ రాజ్ మీడియాతో మాట్లాడారు. అంతేకాదు, మోడీ ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేరని, త్వరలోనే బీజేపీ రావణ కాష్ఠం కానుందని అన్నారు.

ఎందుకీ వ్యాఖ్యలు

తాజాగా రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటిది, ఆర్‌ఎస్ఎస్ సంస్థ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని గురువారం గాంధీ జయంతిని నిర్వహించింది. ఇది కాంగ్రెస్‌కు మంట పుట్టించేలా చేసింది. అదే సమయంలో అఫ్ఘానిస్తాన్‌లో పాలన చేస్తున్న తాలిబాన్‌కు చెందిన మంత్రి ఒకరు భారత్‌కు రాగా, ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఈ రెండు ఘటనలను కూడా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. “ఇదేం పద్ధతి?” అని నిలదీసింది.

గాంధీని చంపిన గాడ్సే ఆర్‌ఎస్ఎస్ భావజాలాన్నే అనుసరించాడని, అంటే ఒకరకంగా ఆర్‌ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ అని ఉదిత్ రాజ్ అన్నారు. గాంధీని చంపించిన సంస్థే ఆయన జయంతిని జరపడం ప్రపంచంలో ఎక్కడా జరగదని, ఒక్క ఆర్‌ఎస్ఎస్‌లోనే జరుగుతుందని విమర్శించారు. ఈ సందర్భంలో మోడీ కూడా దీనిలో భాగస్వామేనని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక విదేశాంగ విధానాన్ని అమలు చేస్తున్నామనే మోడీ, అరాచక పాలనకు ప్రతిరూపంగా ఒకప్పుడు అభివర్ణించిన తాలిబాన్‌లకు రెడ్ కార్పెట్ ఎలా వేస్తారో అని నిలదీశారు. ఇప్పటికీ అఫ్ఘాన్‌లో ప్రజలకు స్వేచ్ఛలేదని, ముందుగా దానిపై స్పందించకుండా తాలిబాన్ మంత్రి రావడంతోనే ఆయనకు రెడ్ కార్పెట్ పరవడం ఏంటని ప్రశ్నించారు.

చైనా, అమెరికా విషయంలోనూ మోడీ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఆ రెండు దేశాలతోనూ అంతర్గతంగా విభేదాలు ఉన్నాయని, అయినా ప్రధాని కప్పుపుచ్చుతున్నారంటే అభినవ రావణుడి మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఈ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు. “మోడీ ప్రతిభ, ప్రపంచ దేశాలు ఆయనను మెచ్చుకుంటే చూసి ఓర్వలేక ఇలా వ్యాఖ్యానిస్తున్నారు” అని ఎదురుదాడి చేశారు.