బాబు కేబినెట్‌ నిర్ణయాలు.. అన్నీ మంచివే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి మండలి సమావేశమైంది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో తమ ఉపాధికి ఇబ్బంది ఏర్పడిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి ఆర్థికంగా ఇబ్బందులు తొలగించేందుకు ఉద్దేశించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ఇటీవలి కాలంలో ప్రకటించారు. దసరా పండుగ రోజున దీనిని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది.

శనివారం ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ పథకంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఇచ్చిన బ్యాడ్జ్, లైసెన్సు ఉన్న డ్రైవర్లకు రూ.15,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. వచ్చే మూడు సంవత్సరాలు కూడా దీనిని కొనసాగించనున్నారు. దీనికి కేబినెట్ ఆమోదించింది. ఈ నెల 4 నుంచే దీనిని అమలు చేస్తారు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను కలెక్టర్లు విడుదల చేశారు. దీని ప్రకారం 2 లక్షల 80 వేల మంది డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు.

ఇక రాజధాని అమరావతి పనులను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు వీలుగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం ఇచ్చే సొమ్ములు సహా అప్పుల రూపంలో తెచ్చే సొమ్మును కూడా ఎస్పీవీ ఖాతాలో జమ చేసి అటు నుంచి ఖర్చు చేయనున్నారు. తద్వారా ప్రభుత్వ నిర్ణయాలు, అనుమతుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. ఈ విధానంలో పనులు వేగంగా పూర్తి అవుతాయని అంచనా వేసుకున్నారు. దీనికి కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో కారవాన్ టూరిజంకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ కారవాన్ టూరిజం అందుబాటులోకి రానుంది. వాస్తవానికి గత నెలలోనే సీఎం చంద్రబాబు విశాఖలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 40 కిలోమీటర్ల మేర కారవాన్ బస్సులు తిరుగుతున్నాయి. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లోనూ కారవాన్ టూరిజం అందుబాటులోకి తీసుకురానున్నారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమృత్’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా నగరాలు, పట్టణాల్లో మరింత పరిశుభ్రతకు పెద్దపీట వేయనున్నారు. అమృత్ పథకంలో కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేయనున్నారు.

ఇక విద్యుత్ శాఖలో ‘ట్రూడౌన్’కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కుష్టు వ్యాధి గ్రస్థులకు గౌరవాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో వారిని ఉద్దేశించి ఇప్పటి వరకు ఉన్న ‘కుష్టు’ అనే పదాన్ని తొలగించనున్నారు. దీని స్థానంలో అంటువ్యాధి లేదా లెప్రసీ అనే పదాలను మాత్రమే కొనసాగించనున్నారు.

మొత్తంగా 20 కీలక అంశాలతో జరిగిన కేబినెట్‌లో ఆయా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.