తెలంగాణ తల్లి: ఎన్నికల వేళ రేవంత్ సెంటిమెంట్ పాచిక!

రాజకీయాలకు సెంటిమెంటుకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎవరు ఎంత చేసినా, ఎన్ని మాటలు చెప్పినా, చివరకు ఎన్నికలు అనగానే ప్రజల సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని గుర్తించిన వారు ఒక మెట్టు ఎక్కుతుంటే, గుర్తించని వారు వంద మెట్లు దిగజారుతున్నారు.

“నా భూమి పత్రాలపై నీ ఫొటో ఎందుకు?” అని ఏపీలో రైతులు నిలదీసినప్పుడే జగన్ మేల్కొని ఉంటే, 11 స్థానాలకు దిగజారే పరిస్థితి ఉండేది కాదు. కానీ, ఆయన గ్రహించలేకపోయారు. భూమికి, రైతుకు ఉన్న సెంటిమెంట్ బంధాన్ని అర్థం చేసుకోలేకపోయారు.

దీనిని అందిపుచ్చుకున్న చంద్రబాబు, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే భూమి పత్రాలపై ముఖ్యమంత్రి ఫొటోలు తొలగించడమే కాక, రైతులకు ప్రాణ సంకటంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. అంతే, ఒక్కసారిగా రైతులు, ప్రజలు కూడా ఆయన పక్షంలోకి వెళ్లిపోయారు. వినీ ఎరుగని విధంగా టిడిపికి 134 స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టారు. కానీ, చిత్రం ఏంటంటే పుస్తకాలపై సీఎం ఫొటోలు తీసేసినా చట్టాన్ని మాత్రం రద్దు చేయలేకపోయారు. కేవలం పేరు మార్చారు. ఎందుకంటే ఇది కేంద్రం చేసిన చట్టం. అయినా సెంటిమెంట్ ఫలించింది.

కట్ చేస్తే, ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ పాచికను విసిరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాస్తవానికి తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వానికి పెద్దపీట వేస్తారు. మా నీరు, మా నేల, మా ఉద్యోగాలు, మా సంపద అంటే వారికి ఎనలేని మక్కువ. ఇదే గతంలో కేసీఆర్‌కు కలసి వచ్చింది. పదేళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నారు. కానీ, అనూహ్యంగా ప్రజలు ఆయనను తిరస్కరించారు. ఇక ఆ సెంటిమెంట్ మాత్రం అలానే ఉండిపోయింది. తాజాగా దీనిపైనే రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఒకే గంట ముందు, హైదరాబాద్ నడిబొడ్డున జంట నగరాలను కలుపుతూ నిర్మించిన “తెలుగు తల్లి ఫ్లైఓవర్” పేరును “తెలంగాణ తల్లి ఫ్లైఓవర్”గా మార్చారు. ఇది తెలంగాణ ప్రజల సెంటిమెంట్. ఎప్పటి నుంచో ఈ పేరు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్ ఉంది. అయితే అన్నగారు ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన వారధి కావడంతో అప్పటి కేసీఆర్, ఇప్పటి రేవంత్ ఇన్నాళ్లూ దీని జోలికి పోలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు రావడంతో, కీలకమైన సమయం ఆవరించడంతో దీనికి పేరు మార్చారు. అయితే ఈ విషయం వెలుగుచూసేసరికి 15 గంటలు పట్టింది.