ఎన్నికల కుస్తీలో కవిత దారెటు?

బీఆర్ ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురై.. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేసిన మాజీ ఎంపీ క‌విత దారెటు?  ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు?  ఏ విధంగా అడుగులు వేస్తారు?  ఇప్పుడు ఇదీ.. రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న జోరు చ‌ర్చ‌. దీనికి కార‌ణం.. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌ర‌మే!.  ఆమె ప్ర‌స్తుతం సొంత పార్టీ ఏర్పాటుపై త‌ల‌మున‌క‌ల‌య్యార‌న్నే చ‌ర్చ సాగుతున్న నేప‌థ్యంలో తాజాగా ప్ర‌క‌టించిన స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌.. త‌దుప‌రి ఆమె తీసుకునే నిర్ణ‌యం వంటివాటిపై ఆస‌క్తి నెల‌కొంది.

రాష్ట్రంలో మూడు ద‌శ‌ల్లో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు, రెండు ద‌శ‌ల్లో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పంచాయ‌తీల్లో పార్టీ గుర్తుపై ఎన్నిక‌లు జ‌ర‌గ‌క‌పోయినా.. పార్టీలు బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులే రంగంలోకి దిగుతారు. ఇక‌, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీల గుర్తుల‌పైనే జ‌రుగుతాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా తెలంగాణ వేడెక్కింది. అధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీఆర్ఎస్‌ల మ‌ధ్యే కీల‌క పోటీ ఉండే అవ‌కాశం ఉన్నా.. బీజేపీ సహా ఇత‌ర పార్టీల ప్ర‌భావం కూడా స్థానిక ఎన్నిక‌ల్లో క‌నిపించనుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌విత వ్య‌వ‌హారం మ‌రింత ఆస‌క్తిగా మారింది. తండ్రి కేసీఆర్ పార్టీ నుంచి ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చేసినా .. తండ్రి పేరును మాత్రం ఆమె వ‌దిలి పెట్ట‌డం లేదు. పైగా ఇటీవ‌ల  త‌న తండ్రి పుట్టిన ఊరు చింత‌కుంట‌కు వెళ్లి బతుక‌మ్మ సంబ‌రాల్లోనూ పాల్గొన్నారు. మ‌హిళ‌ల్లో త‌న హ‌వా త‌గ్గ‌కుండా చూసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో జాగృతి త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజా ఎన్నిక‌ల్లో క‌విత ఎలాంటి పాత్ర పోషిస్తారు? అనేది కీల‌కంగా మారింది. సొంత పార్టీ పెట్టుకునేందుకు ఇంకా స‌మ‌యం ఉంది.

అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడ‌కుండా.. ప్ర‌స్తుతం వ‌చ్చిన స్థానిక సంస్థ‌ల‌లో త‌న త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. త‌న తండ్రి, మాజీ సీఎం ఫొటోను పెట్టుకునే క‌విత రాజ‌కీయాలు చేసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు లేదా.. సానుభూతిప‌రులలో చీలిక వ‌చ్చే అవ‌కాశాన్ని కొట్టి పారేయ‌లేమ‌ని కూడా అంటున్నారు. ఈ రెండు జ‌ర‌క‌పోయినా.. అధికార పార్టీకి మేలు చేసే అవ‌కాశం ఉందని కూడా చెబుతున్నారు. ఏదేమైనా.. క‌విత నిర్ణ‌యం ఇప్పుడు కీల‌కంగా మారింది.