తమిళనాడులో ఘోరం జరిగింది. తమిళ యువహీరో, తమిళగ వెట్రి కగళం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ప్రచారం సభలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రాథమిక సమాచారం మేరకు.. తొలుత 10 మంది చనిపోయారని అనుకున్నా.. తర్వాత తర్వాత.. మృతుల సంఖ్య 39కి పెరిగింది. వీరిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరింత మంది ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. ఈ ఘటనపై విచారణకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సీఎం స్టాలిన్ తొక్కిసలాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
మరో ఏడు మాసాల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగాపెట్టిన టీవీకే పార్టీ తరఫున విజయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరూర్ జిల్లాలో శనివారం సాయంత్రం ఆయన సభ నిర్వహించారు. ఈ ప్రచార సభకు గత రెండు రోజుల నుంచి భారీ ఎత్తున జనాలను తరలించారు. ఇక, విజయ్ సభా ప్రాంగణానికి వచ్చే సరికే వేలాదిగా జనాలు తరలి వచ్చాయి. ఇక, విజయ్ తన ప్రసంగం ప్రారంభించి.. సినిమా డైలాగులతో దంచి కొడుతున్న సమయంలో సభకు వచ్చిన యువత భారీ ఎత్తున చప్పట్లతో మోతమోగించడంతోపాటు.. విజయ్‌ను చూసేందుకు ఎగబడ్డారు.
వాస్తవానికి విజయ్ సభకు జిల్లా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే.. వచ్చిన జనాభాకు.. పోలీసులు చేసిన ఏర్పాట్లకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. ప్రధానంగా స్టాలిన్ కుమారుడు, డిప్యూటీ సీఎంపై విజయ్ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో యువత మరింతగా రెచ్చిపోయారు. విజయ్‌ను చూసేందుకు భారీగా ఎదురొచ్చారు. దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు పడడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే..తొలుత చిన్నదే అనుకున్నా.. తర్వాత తర్వాత.. మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
మరోవైపు.. విజయ్ తొలుత అక్కడ నుంచి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని భావించిన పోలీసులు ఆయనను బలవంతంగా అక్కడ నుంచి పంపించారు. అనంతరం.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం వెంటనే పొరుగు జిల్లాల నుంచి కూడా పోలీసులను అక్కడకు పంపించింది. ప్రస్తుతంపరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. సీఎం స్టాలిన్.. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో టీవీకే నేతలు విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates