తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు అడుగు పడిందన్న ఆనందం ఒక్కరోజులోనే ఆవిరి అయిపోయింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవ రెడ్డి నేరుగా హైకోర్టుకు ఎక్కారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తన పిటిషన్ ను లంచ్ మోషన్ పిటిషన్ గా విచారించాలని ఆయన కోర్టును కోరారు. మాధవ రెడ్డి వినతికి సరేనన్న తెలంగాణ హైకోర్టు.. రిజర్వేషన్ల అంశం గవర్నర్ పరిధిలో ఉండగా ప్రభుత్వం జీవో ఎలా జారీ చేస్తుందని ప్రశ్నించింది. వెరసి స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డి సర్కారు చిక్కులు మొదలైనట్టేనని చెప్పక తప్పదు.
వాస్తవానికి ఎన్నికలను సెప్టెంబర్ చివరిలోగా ముగించాలని ఇదివరకే హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగానే రేవంత్ సర్కారు అప్పటికే ముగించిన కుల గణనను ఆధారం చేసుకుని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన ఓ బిల్లును ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. ఈ బిల్లును పెద్దగా పట్టించుకోని గవర్నర్… ఫైల్ ను నేరుగా రాష్ట్రపతికి పంపించారు. ప్రస్తుతం సదరు బిల్లు ప్రతి రాష్ట్రపతి భవన్ లోనే ఉండిపోయింది. దానిని కదిలించి రైట్ రాయల్ గా బీసీలకు 42 శాతం రిజర్వషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని భావించినా ఫలితం లేకుండా పోయింది.
రాజకీయ కారణాలతోనే ఈ బిల్లు అలా పెండింగ్ లో పడిపోయిందన్న భావనకు వచ్చేసిన రేవంత్ సర్కారు.. జీవో విడుదల చేసి ఎన్నికలకు వెళ్లాలని తీర్మానించింది. అందులో భాగంగా శుక్రవారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తూ పలు జీవోలను జారీ చేసింది. ఈ జీవోలపై తెలంగాణవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. అయితే కొన్ని సంస్థలు రేవంత్ సర్కారు ప్రతిపాదిస్తున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయి. వాటిలోని ఓ సంస్థకు చెందిన మాధవ రెడ్డి అందరి కంటే ముందు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు గవర్నర్ కార్యాలయం వద్ద పెండింగ్ లో ఉండగా… అంత త్వరగా జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా సెప్టెంబర్ చివరిలోగా స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని చెప్పిన కోర్టు ఇప్పుడు మాత్రం అన్ని అవాంతరాలు తేలకుండా ఎన్నికలను అంత హడావిడిగా నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించడం గమనార్హం. అంతేకాకుండా రిజర్వేషన్ల శాతం 50 శాతం మించకుండా ఉండాలి కదా అని కూడా కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates