తెలంగాణ వరద బాధితులను ఆదుకోండి: పవన్

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో తెలంగాణలో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మూసీ నది పొంగిపొరలుతోంది. ఫలితంగా మూసీ పరిసర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులను రంగంలోకి దించేశారు.

భారీ వర్షం కారణంగా మూసీ పరిమితికి మించి పొంగి పొరలుతోందని, ఈ కారణంగా ఎంజీబీఎస్ పరిసరాలు దారుణంగా మారాయని తనకు తెలిసిందని పవన్ పేర్కొన్నారు. ఈ ప్రవాహంతో మూసీ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అధికార యంత్రాంగం ఇప్పటికే సహాయక చర్యలను మొదలుపెట్టాయని ఆయన తెలిపారు. అదికారులు ఇచ్చే సలహాలు, సూచనలను బాధితులు తప్పనిసరిగా పాటించాలని పవన్ కోరారు. 

వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహారం, ఔషధాలు ఇతరత్రా అత్యవసర వస్తువులను అందించే కార్యక్రమాన్ని తెలంగాణ జనసేన శాఖ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ తలంగాణ శాఖ నేతలు, కార్యకర్తలు ఈ సహాయక చర్యల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని కూడా పవన్ సూచించారు. వరద బాధితులకు వీలయినంత మేర సాయాన్ని అందించాలని కోరారు. ఎక్కడ కూడా ఆహారం అందలేదని బాధితులు చెప్పకుండా ఉండేలా పకడ్బందీగా సహాయక చర్యలు కొనసాగించాలని పవన్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.