42 శాతం కోటాతోనే తెలంగాణ ‘లోకల్’ బరి

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు తాను చెప్పినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా కీలకమైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై శుక్రవారం రేవంత్ రెడ్డి సర్కారు ఏకంగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం రేపో, మాపో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు విన్న కాంగ్రెస్ శ్రేణులు, బీసీలు సంతోషంలో మునిగిపోయారు. 

వాస్తవానికి ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు రేవంత్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కుల గణన తర్వాత రాష్ట్రంలో బీసీలు 42 శాతం ఉన్నారని, ఆ దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ ఘనంగా ప్రకటించారు. ఆ ప్రతిపాదనను ఆయన గవర్నర్ కార్యాలయానికి పంపారు. అయితే గవర్నర్ ఆ బిల్లును నేరుగా రాష్ట్రపతికి పంపారు. ప్రస్తతం సదరు బిల్లు రాష్ట్రపతి భవన్ లోనే మూలుగుతోంది.

అయితే ఓ వైపు హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటం, మరోవైపు పార్టీ శ్రేణుల నుంచి ఎన్నికల నిర్వహణ కోసం ఒత్తిడి పెరగడంతో రేవంత్ చివరాఖరుకు కదలక తప్పలేదు. సరే తాము పంపిన బిల్లు రాష్ట్రపతి భవన్ లో పెండింగ్ లో ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించిన రేవంత్… తమ ప్రభుత్వమే ధైర్యం చేసి మరీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా జీవోలను జారీ చేసింది.