చైర్మ‌న్‌కు ‘అవ‌మానం’: చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి!

ఏపీ శాస‌న మండ‌లిలో శుక్ర‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు కొత్త చ‌ర్చ‌కు తెర‌లేచింది. వాస్త‌వానికి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌రిగితే ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ, మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్ రాజును ప్ర‌భుత్వం, అధికారులు కూడా ఉద్దేశ పూర్వ‌కంగా అవ‌మానిస్తున్నార‌ని.. దీనిపై చ‌ర్చించి తీరాల‌ని వైసీపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. ముఖ్యంగా ఈ వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు జోక్యం చేసుకుని మండ‌లికి వ‌చ్చి.. మోషేన్ రాజుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరారు. అయితే.. త‌న‌పై చ‌ర్చ వ‌ద్ద‌ని..ఎలా జ‌రిగేవి అలానే జ‌రుగుతాయ‌ని.. మోషేన్ రాజు వైసీపీ స‌భ్యుల‌కు తేల్చి చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ వైసీపీ ప‌క్ష నాయ‌కుడు, మండ‌లిలో విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మాత్రం ఈ విష‌యంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబట్టారు. దీంతో చ‌ర్చ‌కు మోషేన్ రాజు అనుమ‌తి ఇచ్చారు. అయితే.. ఈ చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో తాను సీటులో కూర్చోవ‌డం స‌రికాద‌న్న ఆయ‌న‌.. ప్యాన‌ల్ చైర్మ‌న్‌కు అవ‌కాశం ఇచ్చి.. తాను బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. అనంత‌రం.. వైసీపీ స‌భ్యులు మాట్లాడుతూ.. చైర్మ‌న్ వైసీపీకి చెందిన నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న‌ను అధికార ప‌క్షం అవ‌మానిస్తోంద‌న్నారు. అధికారిక కార్య‌క్ర‌మాల‌కు ప్రొటోకాల్ ప్ర‌కారం మోషేన్ రాజును ఆహ్వానించాల్సి ఉంద‌ని కానీ.. ఆయ‌న‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని.. దీనిని అవ‌మానంగానే ఆయ‌న భావిస్తున్నార‌ని వైసీపీ స‌భ్యులు పేర్కొన్నారు.

ప్ర‌ధానంగా మూడు అంశాల‌ను లేవ‌నెత్తారు. 1) అసెంబ్లీలో ఇటీవ‌ల నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించారు. అయితే.. దీనికి మోషేన్ రాజును ఆహ్వానించ‌లేదు.2) తిరుప‌తిలో ఈ నెల 13-15 మ‌ధ్య మూడు రోజుల పాటు పార్ల‌మెంటు, అసెంబ్లీల మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధుల సాధికార‌తా స‌ద‌స్సును నిర్వ‌హించారు. దీనికి కూడా ప్రొటోకాల్ ప్ర‌కారం మోషేన్ రాజును ఆహ్వానించ‌లేదు.కానీ, మండ‌లి స‌భ్యుల‌ను ఆహ్వానించారు. 3) ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న వేడుక‌ల‌కు కూడా చైర్మ‌న్‌ను ఎవాయిడ్ చేస్తున్నారు. ఆయ‌న పేరును ఎక్క‌డా పేర్కొన‌డం లేదు. ఈ మూడు అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని వైసీపీ స‌భ్యులు మండ‌లిలో ప్ర‌శ్న‌లు గుప్పించారు.

ఆయా ప్ర‌శ్న‌ల‌పై మంత్రి అచ్చెన్నాయుడు, మండ‌లిలో విప్‌.. పంచుమ‌ర్తి అనురాధ‌లు స‌మాధానం ఇచ్చారు. ఉద్దేశ పూర్వ‌కంగా తాము చైర్మ‌న్‌ను అవ‌మానిస్తున్నామ‌న్న వైసీపీ స‌భ్యుల మాట‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని సూచించారు. తాము ఎక్క‌డా చైర్మ‌న్‌ను అవ‌మానించ‌లేద‌న్నారు. త‌ప్పులు ఎక్క‌డ జ‌రిగాయో ప‌రిశీలించి.. స‌భ‌కు వివ‌రిస్తామ‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు వ‌చ్చి చైర్మ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్న వ్యాఖ్య‌ల‌ను కూడా వెన‌క్కితీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌తి విష‌యం సీఎం చూసుకోర‌ని, ప్రొటోకాల్ సిబ్బంది ఉంటార‌ని.. వారిని అడిగి మ‌రిన్ని వివ‌రాలు ఇస్తామ‌ని చెప్పారు. అయితే.. ఈ స‌మ‌యంలో వైసీపీ స‌భ్యులు ప‌దే ప‌దే ఆందోళ‌న చేయ‌డంతో మండ‌లిని వాయిదా వేశారు.