H-1B వీసాతో మస్క్, నాదెళ్ల, పిచాయ్.. ఇది మర్చిపోతే ఎలా?

అమెరికా టెక్ రంగం నేడు ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడానికి కారణం కేవలం స్థానిక ప్రతిభ మాత్రమే కాదు. విదేశీ మేధస్సు, ముఖ్యంగా భారతీయులు అందించిన తోడ్పాటు కూడా అంతే ప్రధానమైనది. ఎలాన్ మస్క్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి ప్రపంచ నాయకులు తమ కెరీర్ ప్రారంభ దశలో H-1B వీసా సాయంతోనే అమెరికాలో నిలదొక్కుకున్నారు. ఈ వీసా ప్రోగ్రామ్ లేకపోతే అమెరికా నేడు ఈ స్థాయికి చేరుకుందా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.

కానీ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వీసాపై 100,000 డాలర్ల భారీ ఫీజు ప్రకటించడంతో వలస దారులలో ఆందోళన పెరిగింది. ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడం సాధ్యంకాకపోవడంతో ప్రతిభావంతులైన యువతలో నిరుత్సాహం పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు రావాల్సిన ఇంటిలిజెన్స్ పీపుల్స్ ప్రవాహం తగ్గితే, దాని ప్రభావం ఆ దేశ ఆర్థిక శక్తిపై పడకమానదు.

ఎలాన్ మస్క్ కూడా గతంలో బహిరంగంగానే చెప్పాడు “నన్ను అమెరికాలో నిలిపింది, స్పేస్‌ఎక్స్, టెస్లా వంటి కంపెనీలను నిర్మించడానికి తోడ్పడింది H-1B వీసా. ఈ వీసా లేకుంటే అమెరికా ఇంత బలంగా ఉండేది కాదు.” అని అన్నారు. సత్య నాదెళ్ల మాటల్లో కూడా ఇదే ప్రతిధ్వనించింది. “గ్లోబల్ టాలెంట్ లేకపోతే అమెరికా పోటీ పటిమ తగ్గిపోతుంది. H-1B వీసా అమెరికాకు కావాల్సిన ప్రతిభను అందిస్తోంది” అని ఆయన అభిప్రాయం.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇమ్మిగ్రేషన్ ప్రాముఖ్యతను ఎన్నోసార్లు గుర్తు చేశారు. “ఇమ్మిగ్రేషన్ అమెరికా ఆర్థిక విజయానికి ప్రధాన బలం” అని ఆయన 2020లోనే స్పష్టంచేశారు. కాబట్టి వీసా ఫీజు పెంపు కంటే అర్హులైన వారిని గుర్తించి, వారికి అవకాశాలు ఇవ్వడం మంచిదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెయ్యి డాలర్లు వసూలు చేస్తే సమస్యలు మాత్రమే పెరుగుతాయి కానీ, ప్రతిభను ఆకర్షించడం జరగదు.

మొత్తానికి H-1B వీసా అమెరికా ఆర్థిక శక్తిని నిలబెట్టిన పునాది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. భారత్ సహా అనేక దేశాల ప్రతిభావంతులు ఈ వీసా ద్వారా అమెరికాలో అవకాశాలు సృష్టించారు. కాబట్టి భారీ ఫీజుల కంటే ప్రతిభ ఆధారంగా అర్హులైన వారికి వీసా ఇవ్వడమే సరైన మార్గం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.