తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నాడు సీఎం హోదాలో కొనసాగిన ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని హైదరాబాద్ ను ఎంతగానో అభివృద్ది చేశారు. చంద్రబాబు లేకుంటే అసలు హైదరాబాద్ ఇప్పుడున్నట్టు ఉండేది కాదేమో. నేటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ను నాడు చంద్రబాబు ఏ రీతిన అభివృద్ధి చేశారన్న విషయాన్ని ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ రెండు, మూడు మాటల్లో వివరించారు. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ సన్నివేశం కనిపించింది.
భారత బార్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నఅంతర్జాతీయ వర్సిటీకి ప్రభుత్వం భూములు అప్పగించే బిల్లుకు ఆమోదం సందర్భంగా ఆ వర్సిటీ వల్ల ఎలాంటి ప్రయోజనం జరుగుతుందన్న విషయాన్ని లోకేశ్ వివరించారు. ఓ అంతర్జాతీయ సంస్థ ఏర్పాటైతే మన రాష్ట్ర యువతకు ఉత్తమమైన విద్య అందుతుందని, తద్వారా వారికి మంచి భవిష్యత్తు లభిస్తుందని లోకేశ్ చెప్పారు. వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని కూడా మంత్రి చెప్పుకొచ్చారు,.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటైన అత్యున్నత విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ బిజినెస్(ఐఎస్ బీ) గురించి ప్రస్తావించారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రపంచంలోనే అత్యున్నత విద్యను అందిస్తున్న సంస్థగా నిలిచిన ఐఎస్ బీ లో విద్యనభ్యసించిన తెలుగు యువత దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సత్తా చాటుతున్నారని చెప్పారు. అలాంటి సంస్థ కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలు పోటీ పడుతుంటే… చంద్రబాబు తన చాతుర్యం, కష్టంతో వాటిని వెనక్కి నెట్టి ఐఎస్ బీని హైదరాబాద్ కు తీసుకువచ్చారన్నారు. ఐఎస్ బీతో ఇప్పుడు హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఓ ప్రధాన కేంద్రంగా మారిపోయిందని లోకేశ్ చెప్పారు.
వాస్తవంగానే నాడు చంద్రబాబు ఓ పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఇప్పుడున్న న్యూసిటీ మొత్తం నాడు రాళ్లు, గుట్టలతో కప్పబడి ఉంది. అప్పటికి చంద్రబాబు కృషితో సైబర్ టవర్స్ మాత్రం నిర్మాణం జరిగింది. ఆ సమయంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఓ అత్యున్నత బిజినెస్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని దేశంలోని బిజినెస్ దిగ్గజాలు తలచారు. అందుకోసం వారు ఓ మంచి స్థలం కోసం వెతుకుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న చంద్రబాబు… బెంగళూరు వెళుతున్న ఆ వ్యాపార దిగ్గజాలను హైదరాబాద్ లో ఆపుకుని తన ఇంటికి అల్పాహారానికి తీసుకెళ్లారు. విందు సందర్భంగా ఐఎస్ బీకి హైదరాబాద్ ఎంత అనుకూలమన్న విషయాన్ని వివరించిన చంద్రబాబు… ప్రభుత్వ సహకారం గురించి కూడా వివరించి వారిని ఒప్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates