తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణం నేపథ్యంలో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీలో మళ్లీ ఉత్సాహం తీసుకురావాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించింది ఆ పార్టీ. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మినే అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐతే తన పేరు ప్రకటించాక పనబాక లక్ష్మి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.
పనబాక లక్ష్మి తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఏమీ స్పందించలేదని.. ఆమె త్వరలోనే ఎన్నికల ప్రచారం మొదలుపెడుతుందని తెదేపా అగ్ర నేతల్లో ఒకరైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ జనాల్లో సందేహాలు తొలగిపోలేదు. ఐతే ఈ ఊహాగానాలకు తెరదించుతూ పనబాక లక్ష్మి బయటికి వచ్చారు. సోమిరెడ్డితో కలిసి లక్ష్మి, ఆమె భర్త తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.
తద్వారా తెలుగుదేశం పార్టీని వీడట్లేదని, త్వరలోనే తిరుపతిలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నామని సంకేతాలు ఇచ్చారు. దీంతో తెదేపా కార్యకర్తల్లో టెన్షన్ తీరిపోయింది. కష్టకాలంలో చంద్రబాబుకు సైతం ఇది ఉపశమనాన్నిస్తుందనడంలో సందేహం లేదు. కాగా దుర్గా ప్రసాద్ కుటుంబంలో ఎవరికీ టికెట్ ఇవ్వకుండా వైకాపా జగన్ వ్యక్తిగత ఫిజియోథెరపిస్టును తిరుపతి ఎంపీ స్థానంలో బరిలోకి నింపుతున్న సంగతి తెలిసిందే.