కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్.. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని కకావికలం చేస్తోంది. మావోయిస్టులకు గట్టి పట్టున్న రాష్ట్రాల్లో నిరంతరాయంగా జరుగుతున్న కూంబింగ్‌తో మావోయిస్టులు హడలి పోతున్నారు. చర్చలకు తావులేదని కేంద్రం స్పష్టం చేసిన దరిమిలా.. మావోయిస్టులు పుట్టకొకరు.. చెట్టుకొకరుగా మారారు. మరీముఖ్యంగా మావోయిస్టు కేంద్ర కమిటీపై దృష్టి పెట్టిన భద్రతా దళాలు.. కీలక నాయకులను మట్టుబెడుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో మావోయిస్టులు మరింత భీతిల్లుతున్నారు. మరోవైపు.. మావోయిస్టుల్లో మల్లోజుల వేణుగోపాల్ వర్గం తెచ్చిన చీలిక కూడా ఉద్యమానికి గొడ్డలి పెట్టుగా మారింది.
తాజాగా..
ఈ నేపథ్యంలో తాజాగా తొలిసారి ఏక మొత్తంలో 71 మంది మావోయిస్టులు.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళలు కాగా.. మరో 50 మంది పురుషులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో 30 మందిపై 64 లక్షల రూపాయల వరకు రివార్డులు ఉన్నట్టు చెప్పారు. ఆపరేషన్ కగార్ కారణంగానే వారు లొంగిపోయినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అదేసమయంలో జనజీవన స్రవంతిలో చేరేందుకు సుముఖంగా ఉన్న వారిని తాము ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. దీంతో భారీ సంఖ్యలో తొలిసారి 71 మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు.
లొంగిపోతే ఏం జరుగుతుంది?
లొంగిపోయిన మావోయిస్టులకు.. ప్రభుత్వం వారిపై ఉన్న రివార్డు మొత్తానికి మూడింతల సొమ్మును వారికే అందిస్తుంది. అదేసమయంలో వారికి ఇల్లు, ఉద్యోగం, ఉపాధి వంటివాటిని అందిస్తుంది. అదేవిధంగా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న కేసులను కూడా ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అయితే.. ఏకమొత్తంలో 25 లక్షల రూపాయలను, ఇంటిని కూడా ఇస్తున్నారు. ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలతోపాటు ఇంటిని, ఉపాధిని చూపిస్తోంది. లొంగని వారిపై మరింత ఒత్తిడి పెంచుతున్నారు. కగార్‌తో కంగారు పెట్టిస్తున్నారు.
ఎప్పుడో లొంగిపోయారా?
కాగా.. తాజాగా 71 మంది మావోయిస్టులు లొంగిపోయిన వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారు గత నెలలోనే పోలీసులకు పట్టుబడ్డారని అంటున్నారు. అయితే.. వారిని వేర్వేరు చోట్ల నిర్బంధించి మావోయిస్టుల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలపై కూపీలాగని ప్రజాసంఘాల నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. వీరిలో కొందరిని కోవర్టులుగా మార్చుకుని ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. కాగా.. తాజాగా పోలీసులు అరెస్టు చూపించిన మావోయిస్టులు ఏకే తరహా దుస్తులు ధరించి ఉండడం.. ఒకే రకమైన ఆహార్యంతో ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోందని కూడా చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates