కాలుష్యం తగ్గాలి.. పెట్టుబడులూ రావాలి: పవన్

ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత వారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. నగరంలో కాలుష్యకారక పరిశ్రమల వల్ల తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని బొండా అంటే.. కాలుష్యంపై ఉక్కుపాదం మోపితే పెట్టుబడుల మాటేమిటి? అంటూ పవన్ బదులిచ్చారు. పవన్ నుంచి వెలువడ్డ ఈ మాట చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తెలుసుకున్న తర్వాత జనం పవన్ రూటే కరెక్ట్ అంటూ చెప్పుకుంటున్నారు.

బొండా చిన్న సమస్యను ఎత్తి చూపితే పవన్ దానిని పెద్ద ఉద్యమంగానే చేపట్టే దిశగా సాగుతున్నారు. అందులో బాగంగా కాలుష్య నియంత్రణా మండలి కార్యదర్శిగా కొనసాగుతున్న రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజలతో ఓ కీలక సమావేశం నిర్వహించారు. అప్పులతో కొత్త ప్రస్థానాన్ని ప్రారంబించిన ఏపీకి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రావాల్సి ఉందని ఈ సందర్భంగా పవన్ అభిలషించారు. అదే సమయంలో ప్రజల ఆరోగ్యాలకు ముప్పు తెచ్చే కాలుష్య కారకాలను వెలువరించే పరిశ్రమలపై ఒకింత గట్టిగానే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా రాష్ట్రంలోని పరిశ్రమల కాలుష్యాలను తగ్గించాలి… అదే సమయంలో కొత్త పరిశ్రమలు వచ్చే దిశగా చర్యలు చేపట్టాలని అని ఆయన అధికారులకు సూచించారు.

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న విషయాన్ని గుర్తు చేసిన పవన్… ప్రజలను ఇబ్బందుల పాలు చేసే కాలుష్యకారక పరిశ్రమలపై అంత మెతక వైఖరి అవలంభించాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. అలాగని కాలుష్యం వెలువరించని పరిశ్రమలపై కాలుష్యాల పేరిట దాడులు చేస్తే సహించేది లేదని కూడా పవన్ అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణా మండలిలో ఉన్న ఉద్యోగుల వివరాలు, ఇప్పటిదాకా సంస్థ సాధించిన ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికలకు సంబందించిన ఓ సమగ్ర నివేదికను అందించాలని కాంతిలాల్ దండేకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా అసెంబ్లీ జరిగిన ఓ చిన్న చర్చతో కాలుష్య నియంత్రణకు పవన్ పెద్ద ప్రణాళికే రచిస్తున్నారు.