బ‌తికి ఉన్న‌వారిని చూడండి.. చ‌నిపోయిన వారి విగ్ర‌హాలు త‌ర్వాత: సుప్రీం

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో నేత‌ల విగ్ర‌హాలు ఏర్పాటు చేయ‌డం అనేది కామ‌నే. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ విష‌యంపై ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మవుతోంది. విగ్ర‌హాల‌కు ప్ర‌భుత్వాలు నిధులు మంజూరు చేయ‌డంప‌ట్ల‌.. చాలా మంది అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో పేద‌ల‌కు అన్నం.. అందించ‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని సామాజిక ఉద్య‌మ‌కారులు కూడా ఆక్షేపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

“బ‌తికి ఉన్న‌వారిని ప‌ట్టించుకుని.. ముందు వారి ఆక‌లి తీర్చండి. చ‌నిపోయిన వారికి త‌ర్వాత విగ్ర‌హాలు పెట్ట‌వ‌చ్చు. వారిని సంతృప్తి ప‌ర‌వ‌చ్చు.“ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. నేత‌ల‌ను కీర్తించేందుకు.. ఓటు బ్యాంకులు పెంచుకునేందుకు ప్ర‌జాధ‌నాన్ని ఎలా వినియోగిస్తార‌ని కూడా ప్ర‌శ్నించింది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు ఆలోచ‌న చేయ‌క‌పోతే.. తామే నిర్ణ‌యం వెలువ‌రించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సంద‌ర్భంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన మాయావ‌తి ఏనుగు విగ్ర‌హాల ఏర్పాటును కోర్టు గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.

విష‌యం ఏంటి?

త‌మిళ‌నాడు అంటేనే నేత‌ల విగ్ర‌హాల‌కు.. ప్ర‌చారానికి ప్ర‌ధాన ప్రాధాన్యం ఇస్తారు. గ‌తంలో అధికారంలో ఉన్న జ‌య‌ల‌లిత‌.. వీధికో విగ్ర‌హం పెట్టే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు హైకోర్టు అడ్డుకుంది. ఆ త‌ర్వాత‌.. వ‌చ్చిన అన్నాడీఎంకే ప్ర‌భుత్వం ప్ర‌ధాన కూడ‌ళ్ల‌పై `అమ్మ‌` విగ్ర‌హాలు ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా డీఎంకే ప్ర‌భుత్వం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ సీఎం క‌రుణానిధి విగ్ర‌హాల‌ను కూడా ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. అయితే.. ఇది కొన్నాళ్లుగా వివాదంగా మారింది.

ముఖ్యంగా తిరునెల్వేలి జిల్లాలోని వల్లియూర్ వెజిటేబుల్ మార్కెట్ ప్రవేశద్వారం వద్ద కరుణానిధి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌య‌త్నించ‌డం.. తీవ్ర విమ‌ర్శ‌ల‌కు, వివాదానికి కూడా దారితీసింది. దీనిపై కొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కొన్నాళ్ల కింద‌ట కోర్టు అడ్డుకుంది. విగ్ర‌హాలు ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వాలు జీవోలు జారీ చేయ‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టింది. దీనిని సీఎం స్టాలిన్ స‌ర్కారు సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. తాజాగా మంగ‌ళ‌వారం ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చిన‌ప్పుడు.. కోర్టు పైవిధంగా వ్యాఖ్య‌లు చేసింది. మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌మ‌ర్థించింది. ఏదైనా ఉంటే అక్క‌డే తేల్చుకోవాల‌ని సూచించింది.