తొలి పలుకుతోనే అదరగొట్టిన నాగబాబు

జనసేన సీనియర్ నేత, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో కీలక సభ్యుడు, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రరావు పెద్దల సభ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై చాలా రోజులే అయ్యింది. అయితే నాగబాబు ఎన్నిక తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో ఆయన పెద్దల సభలో కాలు పెట్టేందుకే చాలా సమయం పట్టింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభకు వచ్చిన నాగబాబు… మంగళవారం సభలో తొలిసారి మాట్లాడారు. న్యాయం జరగడంలో ఆలస్యం జరిగితే ఎంతటి నష్టం జరుగుతుందన్న అంశాన్ని ఆయన ప్రస్తావించి అందరినీ ఆకట్టుకున్నారు.

సభాధ్యక్షుడితో పాటుగా ప్రధాన ప్రతిపక్ష నేత, ఇతర మంత్రులకు ధన్యవాదాలు తెలిపి నాగబాబు తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఆలస్యంగా అందే న్యాయం వల్ల ఎన్నో విపరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3.30 కోట్ల కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో లక్షకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీటిలో 75 శాతం కేసులు ఏడాదికి పైగా, 30 శాతం కేసులు మూడేళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఏదేనీ కేసులో తనకు న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లు ఎక్కే వ్యక్తికి సకాలంలో న్యాయం అందించలేకపోతే… అతడిని మనం బాధితుడిని చేసినట్లేనని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ, కౌన్సిల్ లలో దాదాపుగా ఇలాంటి అంశాలు దాదాపుగా ప్రస్తావనకే రావు. చివరకు లోక్ సభలో కూడా ఈ తరహా అంశాలు ప్రస్తావనకు రావు. జాతీయ స్థాయిలో పెద్దల సభగా కొనసాగుతున్న రాజ్యసభలో మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి కీలక అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. అర్థవంతమైన చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే దానికి పరిష్కారం చూపడంలో పెద్దల సభ కూడా పెద్దగా సాధించిందేమీ లేదనే చెప్పాలి. భారత న్యాయ వ్యవస్థలో నెలకొన్న విపరీత ధోరణుల కారణంగానే ఏ కేసు కూడా నిర్ణీత వ్వవధిలో ముగియడం లేదని చెప్పాలి. అలాంటి కీలక అంశాన్ని ప్రస్తావించడం ద్వారా నాగబాబు తన తొలి స్పీచ్ లోనే అదరగొట్టేశారని చెప్పాలి.