బొండా ఉమాను కంట్రోల్ చేయాల్సిందే…!

ఫైర్ బ్రాండ్ నాయకులను సీఎం చంద్రబాబు ప్రోత్సహించడం తగ్గించారు. ఎన్నికలకు ముందు కొంత మేరకు వారికి స్వేచ్ఛ ఇచ్చినా, తర్వాత మాత్రం మార్పుదిశగా అడుగులు వేస్తున్నారు. పొరుగు పార్టీల నేతలు నోరు చేసుకుంటున్న దరిమిలా వారిని కట్టడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకులను కూడా చంద్రబాబు నిలువరిస్తున్నారు. దీంతో గతంలో నోరు చేసుకున్న టీడీపీ నాయకులు ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. ఒకప్పుడు వివాదాలకు కేంద్రంగా ఉన్న వారు కూడా మౌనం పాటిస్తున్నారు.

అయితే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు వ్యవహారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఆయన మనసులో ఏదో పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇది పార్టీలోను, కూటమిలోనూ చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో బలమైన నియోజకవర్గాల్లో సెంట్రల్ ఒకటి. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు 6 నుండి 8 శాతం వరకు ఉన్నాయి. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ కూడా ఇక్కడ పుంజుకునేందుకు చర్యలు ప్రారంభించింది.

అయితే, తన నియోజకవర్గంలో తనను అడగకుండా జెండాలు కట్టడానికి వీల్లేదని రెండు మాసాల కిందట తేల్చి చెప్పడంతో ఇది వివాదం అయింది. ఇక తాజాగా శుక్రవారం నేరుగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ను ఆయన టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు సంధించారు. అప్పటి వరకు నియోజకవర్గంలో ఏం జరుగుతోందన్నది బయటకు రాకపోయినా, పరిణామాలు తీవ్రతరం అవుతున్న క్రమంలో నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు స్థానిక పరిస్థితులను పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లారు.

ఇక, బొండా ఉమా ప్రస్తావించిన కాలుష్య కారక కంపెనీ వ్యవహారంపైనా కూపీ లాగారు. దీనివెనుక కూడా చాలానే జరిగిందని తెలుసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై అలర్ట్ అయిన టీడీపీ, ఎంపీ కేశినేని శివనాథ్ ద్వారా ఎమ్మెల్యేను నిలువరించే ప్రయత్నాలు చేసింది. ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయిన ఈ ఇరువురు నాయకులు పలు విషయాలపై చర్చించారని తెలిసింది. ఈ క్రమంలో ఉమాను వెనక్కి తగ్గాలని ఎంపీ తేల్చి చెప్పినట్టు సమాచారం. పరిస్థితి ముదురుతోందని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని కూడా ఆయన సూచించినట్టు తెలిసింది. మరి ఉమా మారుతారో లేదో చూడాలి.