శరన్నవరాత్రులను పురస్కరించుకుని తొలి రోజు నుంచే సవరించిన నెక్ట్స్ జనరేషన్ జీఎస్టీ 2.0ను ప్రకటించిన మోదీ… ఈ పన్ను విధానం పేదలు, మధ్య తరగతికి డబుల్ బొనాంజేనని ఆయన ఆదివారం ప్రకటించారు. మోదీ కంటే తానేమీ తక్కువ అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా శరన్నవరాత్రుల తొలిరోజు అయిన సోమవారం ఓ రెండు కీలక ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు చూసిన వారంతా తెలంగాణ ప్రజలకు రేవంత్ డబుల్ బొనాంజా ఇచ్చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
రేవంత్ ప్రకటించిన ఈ డబుల్ బొనాంజాలో మొదటిది సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటన. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సాధించిన లాభాల్లో ఏకంగా 34 శాతాన్ని బోనస్ గా అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో 41 వేల శాశ్వత కార్మికులు ఉండగా, 25 వేలకు పైగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీరందరికీ ఈ బోనస్ అందనుంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ కు ఒక్కోక్కరికి ఏకంగా రూ.1,95,610 అందనుంది. ఇదిలా ఉంటే… కాంట్రాక్ట్ కార్మికులకు వీరి కంటే తక్కువే బోనస్ వస్తున్నా… దేశ చరిత్రలో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ అందిస్తున్న సంస్థ సింగరేణేనని సీఎం తెలిపారు. దీపావళికి మరోమారు బోనస్ ప్రకటిస్తామని రేవంత్ ప్రకటించారు.
ఇక రేవంత్ సర్కారు నుంచి జారీ అయిన ఓ నోట్ ప్రకారం… విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు కొత్తగా అవసరమయ్యే పోస్టులను కలిపి మొత్తంగా 3 వేల దాకా పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులోనూ విద్యుత్ సంస్థలకు చెందిన అన్ని పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారట. ఇది నిరుద్యోగులకే కాకుండా నియామక సంస్థలకు కూడా సులువుగా ఉంటుందన్న భావన అయితే వ్యక్తమవుతోంది. మొత్తంగా మోదీ మాదిరే రేవంత్ కూడా దసరా వేడుకల ప్రారంభం రోజున రాష్ట్ర ప్రజలకు డబుల్ బొనాంజా ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates