తెలుగు ప్రజలకు చింతమడక గ్రామం పేరు గురించి అంతగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆ గ్రామం బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన ఉద్యమకారుడు, రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) స్వగ్రామం. సిద్దిపేట జిల్లా, అదే మండలంలోని ఓ గ్రామమైన చింతమడక నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కేసీఆర్ అంచెలంచెలుగా ఎదిగారు. తాజాగా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్కడికి వెళ్లగా సీఎం కవిత, సీఎం కవిత అంటూ జనం పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలో జరిగే వేడుకలకు హాజరు కావాలంటూ చింతమడక గ్రామస్థులు కవితను కోరారు. వారి ఆహ్వానాన్ని మన్నించిన కవిత ఆదివారం చింతమడక చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోగైన గ్రామస్థలు, కవిత అనుచరులు సీఎం కవిత అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ నినాదాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా ఇప్పటికే బీఆర్ఎస్ ను వదిలేసిన కవిత ఏ రీతిన సీఎం అవుతారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
బీఆర్ఎస్ ఆస్తుల పంపకమో, అధికార పంపకాలో విస్పష్టంగా తెలయదు గానీ,.. కేసీఆర్ కుటుంబంలో ఇప్పుడు పెను తుఫానే రేగింది. ఈ తుఫానులో కవిత ఒక్కరు ఓ వైపు నిలవగా, మిగిలిన వారంతా మరోవైపు నిలిచారు. అయినా కూడా ఏమాత్రం వెరవని ధైర్యంతో సాగుతున్న కవిత సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్నారు. బీఆర్ఎస్ లేకుంటే తాను రాజకీయం చేయలేనా? అన్న దిశగా కవిత సాగుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఈ విశ్లేషణలు ఎంతమాత్రం నిజమో తెలియదు గానీ కవితకు ఓ మోస్తరు మద్దతు అయితే లభిస్తోంది.
సాధారణంగా తమ గ్రామ ఆడబిడ్డ రావడం అంటే చింతమడక వాసులకు సంతోషమే. అంతేకాకుండా తమ గ్రామం నుంచి రాజకీయాలు మొదలుపెట్టి తెలంగాణను ఏకంగా ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన కేసీఆర్ కుమార్తె తమ ఊరికి రావడం వారిని ఉబ్బితబ్బిబ్బులకు గురి చేసిందనే చెప్పాలి. గ్రామ యువత కూడా కవిత రాకను సాదరంగా ఆహ్వానించారు. బతుకమ్మ ఆటలకు ముందుగా కవిత ప్రసంగిస్తుండగా… సీఎం కవిత అంటూ అక్కడి వారు నినాదాల హోరు వినిపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates