చంద్ర‌బాబు మ‌రో రికార్డు: స్కోచ్ గోల్డెన్ అవార్డ్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తాను పుట్టి పెరిగిన గ్రామానికి స్కోచ్ గోల్డెన్ అవార్డును అందుకోనున్నారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని నారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు జ‌న్మించారు. అయితే.. ఆయ‌న కుప్పం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డంతో చాలా మంది కుప్పంలోనే ఆయ‌న పుట్టార‌ని, ఇదే ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని అనుకుంటారు. వాస్త‌వానికి చంద్ర‌గిరి నియోజ‌కవ‌ర్గం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. నారావారి ప‌ల్లెలో ఆయ‌న జ‌న్మించారు.

గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో నారా వారి ప‌ల్లెలో చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ.. తాము అధికారంలోకి వ‌చ్చాక నారా వారిప‌ల్లెను స్వ‌ర్ణ‌మ‌యం చేస్తామ‌ని, అభివృద్ధి లో ప‌రుగులు పెట్టిస్తామ‌ని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ప్ర‌జ‌ల‌కు హామీలు కూడా గుప్పించారు. ఇక‌, అధికారంలోకి వ‌చ్చీరావ‌డంతోనే.. చంద్ర‌బాబు చంద్ర‌గిరి(టీడీపీ ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు)..లో అభివృధ్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ‘స్వర్ణ నారావారిపల్లి’ ప్రాజెక్ట్ మొదటి సంవత్సరంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ గోల్డెన్ అవార్డు అందుకోనుంది.

ఎందుకు వ‌చ్చింది?

నారావారి ప‌ల్లెకు స్కోచ్ అవార్డు రావ‌డం వెనుక‌.. ప‌లు రీజ‌న్లు ఉన్నాయి. 1) పీఎం సూర్య‌ఘ‌ర్‌కు ఇక్క‌డ ప్రాధాన్యం ఏర్ప‌డింది. 2) 99 శాతం ఇళ్ల‌పై సౌర ఫ‌ల‌కాల‌ను ఏర్పాటు చేశారు. 3) సాధార‌ణ విద్యుత్ వినియోగం త‌గ్గి, సౌర విద్యుత్ వినియోగం పెరిగింది. 4) ప్రాజెక్ట్‌లో భాగంగా 1,600 కుటుంబాలు సౌరశక్తితో విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. 5) ఏటా 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. 6) కర్బన ఉద్గారాలను తగ్గించగలిగారు. 7) హరిత స్వర్ణాంధ్రప్రదేశ్‌ దిశగా నారా వారిప‌ల్లె ప‌రుగులు పెడుతోంది.

బాబు హ‌ర్షం..

త‌ను పుట్టి పెరిగిన గ్రామం నారా వారిప‌ల్లెకు స్కోచ్ అవార్డు రావ‌డం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ విశిష్ట విజయానికి కృషి చేసిన నారా వారిప‌ల్లెలోని ప్రతి కుటుంబ స‌భ్యుడికీ ఆయ‌న అభినం ద‌న‌లు తెలిపారు. కృషి చేస్తే.. అసాధ్యం సుసాధ్యం అవుతుంద‌ని పేర్కొన్నారు.