తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు అంతర్గత వివాదాలతో సతమతం అవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలోనే ఈ గొడవలు మొదలు కావడం గమనార్హం. కేసీఆర్ కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే అన్ని పదవులు కట్టబెడితే… కుమార్తెనైన తనకు ఏం మిగులుతుందని కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్టీ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. అయితే కవితను ఏకాకిని చేద్దామని కేటీఆర్ రచించిన వ్యూహాన్ని కవిత తుత్తునీయలు చేసి సేఫ్ జోన్ కు చేరింది.
అసలు విషయానికి వస్తే… కవితకు పార్టీలో ప్రత్యేక పదవి అంటూ ఏమీ లేదు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్సీగానే ఆమె కొనసాగుతున్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా, ఆ సంస్థ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. తాజా పరిణామాల్లో పార్టీ ఆమెను సస్పెండ్ చేస్తే… ఆమె పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ సభ్యత్వం కూడా తనకు వద్దంటూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అది కూడా స్పీకర్ ఫార్మాట్ లో ఆమె రాజీనామా చేశారు. సాధారణంగా అయితే ఈపాటికి ఆమె రాజీనామాకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపి ఉండేవారే. ఎందుకో గానీ ఆయన ఇప్పటిదాకా దానిని అలా పక్కన పడేశారు.
సరిగ్గా నాలుగు రోజులు వెనక్కెళితే.. కవిత రాజీనామా ఆమోదంపై మీడియా వద్ద పిచ్చాపాటిగా ప్రస్తావించిన గుత్తా… దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తన పదవికి రాజీనామా చేసిన తర్వాత కవిత తనకు ఫోన్ చేసి రాజీనామాను ఆమోదించాలని కోరినట్టు ఆయన చెప్పారు. అయితే ఏదో భావోద్వేగంలో, క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తనకు అనిపిస్తోందని, మరోసారి ఆలోచించుకోవాలని తాను కవితను కోరినట్టు ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయి నాలుగు రోజులు అయినా కవిత నుంచి ఎలాంటి స్పందన లేదు. అంటే కవిత వ్యూహాత్మకంగానే సాగుతున్నారన్న మాట.
సాధారణంగా స్పీకర్ ఫార్మాట్ రాజీనామా అంటే… క్షణాల్లో ఆమోద ముద్ర పడినట్టే. అయితే కవిత రచించిన వ్యూహం చక్కగానే వర్కవుట్ అవుతోందని చెప్పాలి. గుత్తా బీఆర్ఎస్ కు చెందిన వారే. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆయన అధికార పక్షం వైపు మొగ్గుచూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కవిత రాజీనామాను పెండింగ్ లో పెట్టడం ద్వారా అటు బీఆర్ఎస్ కు షాకిస్తూ.. ఇటు కాంగ్రెస్ కు దగ్గరయ్యే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారని వినికిడి. కవిత పార్టీని వీడిన వెంటనే ఆమెను ఒంటరిని చేసి ఆమె స్థాపించిన జాగృతిని కూడా చీల్చేసిన కేటీఆర్.. ఎమ్మెల్సీ పదవి కూడా ఊడితే ఇక కవిత బతుకు బస్తాండేనని ఊహించారు. అయితే అన్నకు షాకిస్తూ కవిత తన ఎమ్మెల్సీ పదవి ఇప్పుడప్పుడే రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates