వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గురించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. గత ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సులను నేలకు విసిరికొట్టి.. పోలింగ్ బూత్‌లో అరాచకం సృష్టించిన కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మాచర్ల నియోజకవర్గం నుంచి ఐదు సార్లు విజయం దక్కించుకున్న పిన్నెల్లి.. ఒక దశలో చెలరేగిపోయారు. అయితే.. తాజాగా ఈ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. పిన్నెల్లి కేంద్రంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయనకు బలమైన హెచ్చరికలు చేశారు. ‘చెత్తను ఊడ్చేశాను.. రాజకీయ చెత్తను కూడా ఊడ్చేస్తాను’ అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారం గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించిన చంద్రబాబు ఇక్కడ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం.. ఆయన ఇక్కడ నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. పిన్నెల్లి, ఆయన సోదరుడు చేసిన రాజకీయాలపై నిప్పులు చెరిగారు. తాను గతంలో మాచర్లలో పర్యటించాలని ప్రయత్నించానని.. అయితే.. అప్పట్లో తనను రాకుండా అడ్డుకున్నారని, అంటే మాచర్లలో ఏమేరకు ప్రజాస్వామ్యం ఉందో అర్ధమవుతుందని చంద్రబాబు చెప్పారు. కానీ, గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు అరాచక శక్తులకు గట్టి బుద్ధి చెప్పారని, దీంతో ఇప్పుడు ప్రజాస్వామ్యం విరజిల్లుతోందని.. ఎవరైనా స్వేచ్ఛంగా ఇక్కడ తిరిగే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఇదేసమయంలో తాను ఇలాంటి ముఠా రాజకీయాలను చూస్తూ ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇలాంటి వారిని ఎలా అణిచేయాలో తనకు తెలుసునని అన్నారు. ఇలాంటి రాజకీయ వదరుబోతులను దారిలోకి తెచ్చేందుకు కఠినంగా వ్యవహరిస్తానని తేల్చి చెప్పారు. ఒకప్పుడు రాయలసీమను ఫ్యాక్షన్‌నుంచి ఎలా బయట పడేశానో.. నాటి అధికారులకు, ప్రజలకు కూడా తెలుసునన్న చంద్రబాబు ఇప్పుడు మాచర్లను కూడా అలానే బయట పడేస్తున్నామన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఉంటుందని.. దానిని భగ్నం చేస్తే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. తాటతీస్తామని హెచ్చరించారు. “మీ రాజకీయాలు మీరు చేసుకోండి. కానీ, ప్రజల జోలికి వస్తే మాత్రం తాట తీసి చూపిస్తాం” అని వార్నింగ్ ఇచ్చారు.
సూపర్ సిక్స్‌పై..
గత 15 మాసాల్లో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని.. ప్రజలే ఈ పథకాలు సూపర్ హిట్ కొట్టాయని అంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్లిపోయినా.. తాము తట్టుకుని ముందుకుసాగుతున్నామన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటున్నామని చంద్రబాబు తెలిపారు. కానీ, ఇంత చేస్తున్నా.. తమపై విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఉచిత బస్సును వారు కలలో కూడా ఊహించలేదు. కానీ,మేం ఇచ్చాం. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. అందరికీ తల్లికి వందనం కింద సొమ్ము ఇచ్చాం. ఇది కూడా వారు ఊహించలేదు. మైండ్ బ్లాంక్ అయ్యేలా మేం సుపరిపాలన అందిస్తున్నాం.” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates