ఒకవైపు తరుముకొస్తున్న హైకోర్టు తీర్పు గడువు. మరోవైపు అపరిష్కృతంగా ఉన్న బీసీ రిజర్వేషన్. వెరసి స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. పూటకోమాట.. తడవకో నిర్ణయంతో ఈ ఎన్నికల వ్యవహారంపై పిల్లిమొగ్గలు వేస్తోంది. అంతేకాదు.. సొంత పార్టీ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఫలితంగా ఈ ఎన్నికల విషయంపై సర్కారు తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఈ ఎన్నికల కోసం గ్రామీణ ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం.
హైకోర్టు ఏం చెప్పింది?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2023లోనే ఏర్పడింది. ఇక, 2024 జనవరి-ఫిబ్రవరి మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. ప్రత్యేక అధికారుల పాలనతోనేనెట్టుకు వస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు మురిగిపోయి రెండు సార్లు వెనక్కి కూడా వెళ్లిపోయాయి. మరోవైపు.. గ్రామీణ తెలంగాణలో పనులు కూడా ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో పలువురు మాజీ సర్పంచులు.. గ్రామ స్థాయి పెద్దలు హైకోర్టును ఆశ్రయించారు. తక్షణం ఎన్నికలు నిర్వహించాలని.. లేకపోతే నిధులైనా కేటాయించాలని వారు కోరారు. ఈ పిటిషన్లపైనే దాదాపు 10 నెలలపాటు వాదనలు జరిగాయి. అనంతరం హైకోర్టు.. ఈ నెల 30(అప్పటికి మూడు మాసాలు)లోపు నిర్ణయం తీసుకుని.. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గడువుకు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది.
ప్రభుత్వ వ్యూహం ఏంటి?
గతం నుంచి రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యంగా ఆయన కుల గణనను కూడా చేపట్టారు. దీనిపై నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. 42 శాతంగా ఉన్న బీసీలకు న్యాయం చేయాలంటే.. 42 శాతం రిజర్వేషన్ వారికి కల్పించాలని అసెంబ్లీలో అధికార, విపక్షాలు కూడా పలు చర్చల అనంతరం.. ఏకగ్రీవానికి వచ్చారు. దీనికి సంబంధించిన బిల్లును కూడా రెడీ చేశారు. అయితే.. గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకువెళ్లినా.. ఈ బిల్లు ఆమోదం పొందలేదు. దీనిపై ఢిల్లీలో నిరసన కూడా నిర్వహించారు. అయినా.. మోక్షం లభించలేదు. ఇదిలావుంటే.. కేవలం స్థానిక ఎన్నికల వరకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేలా ఆర్డినెన్స్ ఇవ్వాలని కూడా ప్రయత్నించారు. కానీ, ఇది కూడా ఇంకా తేలలేదు. ఆర్డినెన్స్ ప్రతిపాదన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గరే పెండింగులో ఉంది.
మొన్నో మాట.. నేడో నిర్ణయం!
ఇక, తాజా పరిణామాలను గమనిస్తే.. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. అసలు రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లేది లేదన్నారు. అవసరమైతే.. హైకోర్టును ఆశ్రయించి.. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన గడువునుమరింత పొడిగించేలా చేసుకుంటామన్నారు. అంతేకాదు.. గవర్నర్ సదరు ఆర్డినెన్సును ఆమోదించే గడువు విషయంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే దాకా వేచి చూస్తామని చెప్పారు.
దీంతో ఇక, ఇప్పట్లో స్థానికం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు అయింది. కానీ, ఇంతలోనే శనివారం సాయంత్రం పార్టీ నాయకులు, మంత్రులతో జరిగిన చర్చల్లో హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని నాయకులు చెప్పారు. ఎన్నికలు నిర్వహించడమే సరైందని అన్నారు. దీంతో సీఎం మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నెల 30లోగానే.. స్థానికానికి వెళ్తామని చెప్పారు. అయితే.. రిజర్వేషన్ విషయాన్ని మరోరెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఇలా.. మొన్నో మాట.. నేడో నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates