తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై నిన్న మొన్నటివరకు హడావుడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామన్నారు.
అయితే, సుప్రీంకోర్టు తీర్పు తాజా ఎన్నికలకు సంబంధం ఏమిటనేది ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికలను 90 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు గడువు ఇచ్చింది. ఈ గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఇప్పటికే స్థానిక అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వంప్రస్తుతం నిన్నటి దాకా ఎన్నికలకు “సై” అన్న స్థితిలో ఉంది.
ఇక ఇప్పుడు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉంటామని రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. వాస్తవానికి, సుప్రీంకోర్టు కేసు వేరు. రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి తమకు వచ్చిన బిల్లులను గరిష్టంగా మూడు మాసాలలో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది. అందరూ రాజ్యాంగానికి బద్ధులై ఉండాలని కూడా పేర్కొంది.
అయితే, దీనిని విభేదిస్తూ 18 ప్రశ్నలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ప్రస్తుతం ఇది విచారణ దశలో ఉంది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని కోర్టు నియమించింది. దీనిపై తుది తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు.
కానీ రేవంత్ రెడ్డి, తీర్పు రావాల్సిన తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్లే యోచన చేస్తామని చెబుతున్నారు. దీనికి కారణం, 42 శాతం బీసీలకు స్థానిక కోటాలో రిజర్వేషన్స్ కేటాయిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఇది గవర్నర్‌దగ్గర పెండింగ్‌లో ఉంది. ఆయన ఆమోదించలేదు. రేవంత్ రెడ్డి భావిస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గవర్నర్ ఆమోదం కూడా వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించి, స్థానిక సంస్థల ఎన్నికల గడువును పెంచేలా కోరతారు. ఆ తర్వాతే స్థానికంపై నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుంది. 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు కేటాయించి తర్వాతే ఎన్నికలకు వెళ్తామని రేవంత్ స్పష్టం చేశారు.
అందువలన, సుప్రీంకోర్టు తీర్పు, గవర్నర్ ఆమోదం అనుసరించి కనీసం 6–10 మాసాల సమయం పడే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. మరోవైపు, రేవంత్ ప్రకటనపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. సర్కారుపై గ్రామీణ స్థాయిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే ఇలా వాయిదా వేస్తున్నారని బీఆర్‌ఎస్ వ్యాఖ్యానించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates