పవన్ పరిస్దితి ఇంత అన్యాయమైపోయిందా ?

ఇదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అర్జంటుగా బీజేపీ నాయకత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి రమ్మని కబురుచేసింది. దాంతో సోమవారం రాత్రికి జనసేన లెఫ్టినెంట్ నాదెండ్ల మనోహర్ ను తీసుకుని పవన్ హడావుడిగా సోమవారం రాత్రికే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో అగ్ర నేతల నుండి కబురు వచ్చిందని అందుకనే పవన్ అర్జంటుగా బయలుదేరి వెళ్ళిపోయారంటు సోమవారం సాయంత్రం నుండి మీడియా ఒకటే ఊదరగొట్టేసింది. దాంతో ఢిల్లీలో ఏమో అయిపోతోందంటూ హైదరాబాద్ లో నానా హడావుడి మొదలైపోయింది.

సీన్ కట్ చేస్తే సోమవారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్న పవన్ కు మంగళవారం రాత్రివరకు వెయిటింగ్ తోనే సరిపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుండి పిలుపు రావటంతోనే పవన్ హడావుడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్ళినట్లు ఇటు కమలం పార్టీ నేతలు అటు జనసేన నేతలు కూడా చెప్పుకున్నారు. అంతా బాగానే ఉంది మరి ఢిల్లీకి బయలుదేరే ముందు ఉన్న హడావుడంతా ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఏమైందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు బీజేపీ నేతలు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా కీలక నేతలను పిలిపించుకుంటున్నారు ప్రచారం కోసం. ఇంత హడావుడి జరుగుతున్న సమయంలోనే గ్రేటర్ పోటీనుండి జనసేనను విత్ డ్రా చేయించిన బీజేపీ నేతలు పవన్ తో ప్రచారం చేయించేందుకు ఒప్పించారు. మరి ఇంత కీలకమైన ఎన్నికల సమయంలో పవన్ను ఢిల్లీలోనే బీజేపీ అగ్రనేతలు వెయిటింగ్ లో ఎందుకు ఉంచారో అర్ధంకావటం లేదు.

పవన్ ఢిల్లీ టూర్ లేకపోతే ఈ పాటికే కమలం అభ్యర్ధులకు మద్దతుగా హైదరాబాద్ లో ప్రచారానికి దిగే వారేమో. ఎందుకంటే ఇక ప్రచారానికి ఉన్నది ఐదు రోజులు మాత్రమే. ఈ విషయాలేవీ అగ్రనేతలకు తెలీకుండా ఉండదు. అయినా వెయిటింగ్ లోనే ఉంచారంటే వెనుక ఏదో పెద్ద కారణమే ఉండాలనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నడ్దాతో భేటీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా పవన్ భేటి ఉంటుందని అంటున్నారు.

ఢిల్లీకి చేరుకున్న 24 గంటలవుతున్నా ఇంకా నడ్డాతోనే కలవలేని పవన్ ఇక అమిత్ షా తో ఏమి భేటి అవుతారో ఏమో. మొత్తం మీద బీజీగా ఉన్న నేతను హడావుడిగా పిలిపించి వెయిటింగ్ లో పెట్టారంటే పవన్ పరిస్ధితి మరీ ఇంత దయనీయంగా తయారైపోయిందా అనే చర్చ మొదలైపోయింది. మామూలుగా ఏ పార్టీ అయినా సొంత నేతలను కాదని ముందు మిత్రపక్షం నేతలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ బీజేపీ మాత్రం రివర్సులో పవన్ను పిలిపించుకుని మరీ వెయిటింగ్ లో పెట్టిందంటే పవన్ కున్న సీన్ ఏమిటో అర్ధమైపోతోంది.