వైసీపీ హయాంలో జరిగిన తప్పుల కారణంగా ప్రజాధనం వృథా అవుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. వైసీపీ హయాంలో అప్పులు చేశారని, లెక్క పత్రం కూడా లేకుండానే అప్పులు తెచ్చారని ఆరోపించారు. అయితే.. ఈ అప్పుల సొమ్మును దేనికి ఖర్చు చేశారో కూడాతెలియడం లేదన్నారు. ఎంత తవ్వినా.. అప్పులు వస్తూనే ఉన్నాయని తెలిపారు. ఒకవైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధిని అమలు చేస్తూనే.. ఇంకోవైపు.. వైసీపీ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని.. కానీ, ఆ పార్టీ మాత్రం తాము ప్రజలను ఏదో ఉద్ధరించినట్టు చెబుతోందని విమర్శించారు. తమ హయాంలోనే ఏదో జరిగిందని చెబుతోందన్నారు.
తాజాగా రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వైసీపీ హయాంలో చిత్తూరులో కట్టిన ప్రీబ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కారణంగా.. రాష్ట్ర ప్రజలపై 100 కోట్ల రూపాయల అదనపు భారం పడిందన్నారు. ఇది జరిమానా రూపంలో కేంద్ర పర్యావరణ విభాగానికి జమచేయాల్సి వచ్చిందని.. అయితే, తాము వచ్చిన తర్వాత.. దీనిపై కూడా పోరాటం చేసి.. ఆ జరిమానాను 25 కోట్ల రూపాయలకు తగ్గించి..చెల్లించామన్నారు. “ఇదంతా ఎవరి కోసం? వైసీపీ నాయకుల కోసం చేసిన తప్పుల కారణంగా రాష్ట్ర ప్రజలు ఈ భారాలు మోయాల్సి వస్తోంది. ఇదంతా మరిచిపోయారని ఆ పార్టీ అనుకుంటోంది. కానీ, మేం ప్రజల మధ్యకు తీసుకువెళ్తాం. వైసీపీ విధానాలను ప్రజలకు వివరిస్తాం“ అని చంద్రబాబు తెలిపారు.
పులివెందులకూ నీరిచ్చాం..
ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ.. సీమకు చేసింది ఏమీలేదని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చాక.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజలకు కూడా నీరు ఇచ్చి ఆదుకున్నామన్నారు. అందుకే అక్కడి ప్రజలు ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. శ్రీశైలంలో నీటిని నిల్వ చేయడం ద్వారా.. అక్కడ నుంచి మల్యాల వరకు.. అటు నుంచి కుప్పం దాకా నీటిని తీసుకువెళ్లామని సీఎం వివరించారు. హంద్రీనీవా ప్రాజెక్టు కోసం 13 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు వివరించారు. తుంగభద్ర డ్యామ్‌కు దెబ్బతిన్న గేట్లను సరిచేసినట్టు తెలిపారు.
పోలవరం పూర్తి..
ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన డయాఫ్రం వాల్‌ను పూర్తి చేయనున్నట్టు సీఎం వివరించారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే.. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ఆయన తెలిపారు. అయితే.. అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదని, పైగా నెపాన్ని తమపై నెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. అయినా భరించామని.. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అదనపు ఖర్చుతో డయాఫ్రం వాల్‌ను కట్టిస్తున్నామని.. ఇది డిసెంబరు నాటికి పూర్తవుతుందని చెప్పారు. 2028 నాటికి ప్రాజెక్టు నుంచి నీటిని ఇస్తామని.. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates