అప్పుడెప్పుడో ఐదేళ్ల క్రితం నాటి సీఎం జగన్ సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీష్ ను ప్రవేశపెడతామని ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను విపక్షాల కంటే ముందుగా జగన్ పార్టీ ఎంపీగా ఉండి మరీ ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఖండించారు. జగన్ నిర్ణయంతో రాజు గారు పూర్తిగా వైసీపీకి దూరయ్యారు. అయినా తెలుగుపై రాజు గారికి ఇంత ప్రేమ ఎందుకు? పదవులను పోగొట్టుకునే ప్రమాదం కొనితెచ్చుకోవడం అవసరమా? అని అంతా నొసలు చిట్లించారు. అయితే రాజు గారు నాడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది ఇప్పుడు విస్పష్టంగా తెలిసి వస్తోంది. ఉపసభాపతి స్థానంలో ఉన్న రాజు గారు శుక్రవారం నాటి సభలో మన అమ్మ భాష తెలుగు కమ్మదనం ఎలా ఉంటుందో చూపించారు.
శుక్రవారం నాటి ఏపీ అసెంబ్లీ ముందుకు మధ్యాహ్నం సమయంలో పలు కీలక బిల్లుకు వచ్చాయి. ఈ సమయంలో అధ్యక్ష స్థానంలో రాజు గారే ఉన్నారు. బిల్లును ప్రస్తావించడంతో పాటుగా ఆ బిల్లుకు అనుకూలంగా ఉన్నవారు అవును అని చెప్పండి… వ్యతిరేకంగా ఉన్న వారు కాదు అని చెప్పండి అని రాజు గారు తెలిపారు. సభలో ఉన్నదంతా కూటమి పార్టీల ఎమ్మెల్యేలే కాబట్టి అంతా అవుననే అన్నారు. ఈ సందర్భంగా అవును అన్నారు… అందరూ అవును అన్నారు బిల్లుకు సభ ఆమోదం లభించింది అంటూ అచ్చ తెలుగు భాషలో పలికారు. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో ఈ తరహా మాటలు విని ఉండం. అయితే రాజు గారి పుణ్యమా అని ఆ మాటలను ఇప్పుడు తెలుగులో వినే అవకాశం లభించింది.
సాధారణంగా దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తమ మాతృ భాషను అధికంగా వినియోగించాలన్న కదులుతున్నా… బిల్లుల ఆమోదంలో మాత్రం నాటి బ్రిటిషర్లు నేర్పిన… దోస్ హూ ఆర్ ప్రపోజ్ సే ఎస్..దోస్ హూ ఆర్ అపోజ్ సే నో అంటూ స్పీకర్ కోరడం…ఆ తర్వాత సభ్యుల ఎస్ లు, నో లను విని ఆ బిల్లు ఆమోదం పొందిందో, లేదో తెలిపే విషయాన్ని కూడా ఆంగ్లంలోనే చెప్పేసి ముగిస్తారు. అయితే అందుకు భిన్నంగా రాజు గారు తనదైన శైలిలో అమ్మభాష పరిమళాన్ని అసెంబ్లీ ద్వారా తెలుగు ప్జజలకు వినిపించారు. బిల్లుల విషయమే కాకుండా రాజు గారు తన నోట నుంచి వచ్చే ప్రతి మాటను కూడా తెలుగులోనే వచ్చేలా చూసుకుంటున్నారు. వెరసి రాజు గారు అధ్యక్ష స్థానంలో ఉంటే.. సభ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతుందనడంలో అతిశయోక్తి లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates