జీఎస్టీ సంస్కరణలు రాష్ట్రానికి గేమ్ ఛేంజ్‌గా మారనున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆయన.. జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడారు. పన్నుల తగ్గింపుతో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. గతంలో పన్నులను సరళీకరించడం ద్వారా ప్రస్తుతం 2 రకాల శ్లాబులకు మాత్రమే పరిమితం చేశారన్నారు. తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. ధరలు తగ్గడంతో ఆయా వస్తువుల కొను గోలు పెరిగి.. అదేసమయంలో రాష్ట్రానికి కూడా ఆదాయం చేకూరుతుందని సీఎం వివరించారు.
రాష్ట్రానికి సంపద పెంచేందుకు అహర్నిశలు కష్టపడుతున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టి జరిగితేనే సంక్షేమ పథకాలను అమలు చేయగలమని తెలిపారు. “సంపద సృష్టి చేయని వాళ్లకు సంక్షేమం ఇచ్చే అర్హత లేదు“ అంటూ.. పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. సంపద సృష్టించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తాను సంస్కరణలను అందిపుచ్చుకుంటానని తెలిపారు. ఈ విషయంలో చాలా ముందుంటానని కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే సంపద వస్తుందన్న ఆయన.. దానిని పేదలకు సంక్షేమం రూపంలో తిరిగి పంచుతా మన్నారు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదన్నారు. రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం పరోక్ష పన్నులు కట్టేవారి సంఖ్య కూడా పెరుగుతుందని.. దీంతో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. జీఎస్టీ ద్వారా 2018లో రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం వస్తే.. ప్రస్తుతం 22.08 లక్షల కోట్ల ఆదాయం దేశానికి సమకూరిందన్నారు.
వన్ నేషన్ – వన్ విజన్!
దేశంలో ఇప్పుడు సంస్కరణలు అమలు అవుతున్నాయన్న చంద్రబాబు.. ఒకే దేశం- ఒకే విజన్ నినాదంతో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు గ్రోత్ సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. అనంతరం.. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనికి ఏకగ్రీవంగా సభ్యులు సంతకాలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates