తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలకమైన సెప్టెంబరు 17(తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం)నాడు మౌనంగా ఉండిపోయింది. వాస్తవానికి సెప్టెంబరు 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రారంభించిందే.. అప్పటి సీఎం కేసీఆర్. ఆయన అధికారంలో ఉన్న పది సంవత్సరాలు కూడా.. ఈ రోజు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబురాలు చేశారు. ఇక, పార్టీ కార్యాలయంలో ఆటా పాటలతోపాటు విందులు కూడా ఏర్పాటు చేశారు. అప్పటి సీఎం కేసీఆర్.. ఘనంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగాలు దంచికొట్టారు.
కానీ.. అధికారం పోయిన తర్వాత.. అసలు ఏ కార్యక్రమాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. దీంతో పార్టీ కార్యాలయాలకు కూడా శోభ పోయింది. నాయకులు కూడా ఎవరికి వారు మౌనంగా ఉంటున్నారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది. జిల్లాల్లో మంత్రులు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి కూడా.. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.
అయితే.. కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ కానీ.. ఎక్కడా కనిపించలేదు. పార్టీ కేంద్ర కార్యాలయం బీఆర్ఎస్ భవన్‌లోనూ సందడి లేకుండా పోయింది. ఒకరిద్దరు నాయకులు మాత్రమే పాల్గొని మమ.. అని అనిపించారు. కీలక నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే.. ప్రజలు.. కార్యక్రమాలు గుర్తుంటాయా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ప్రజలను గెండెల్లో పెట్టుకుంటామన్న కేసీఆర్.. ఇలాంటి కీలక కార్యక్రమాలకు దూరంగా ఉండడం సరికాదని.. మేధావులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates