నారా లోకేష్ కేరాఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్‌… !

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరిందా? నిన్న మొన్నటివరకు ఢిల్లీలో రాజకీయాలు చేయడంలో ఆయన దూకుడుగా వ్యవహరించారు.. ఇప్పుడు ఆయన ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరేలాగా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో సింగపూర్ తాజాగా లండన్లో పర్యటించిన నారా లోకేష్ అక్కడి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి సీఎం చంద్రబాబుతో కలిసి నారా లోకేష్ గాని ఇతర మంత్రులు కానీ వెళ్లడం సహజం.

కానీ గత రెండు నెలల కిందట నారా లోకేష్ ఒక్కరే సింగపూర్ కు వెళ్లారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ రోడ్డు షో కూడా నిర్వహించారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడి పెట్టేలాగా ప్రోత్సహించటం, రాష్ట్రానికి రావాలని పిలుపునివ్వడం వంటి అంశాలు జరిగాయి. ఇక తాజాగా లండన్ లో పర్యటించిన నారా లోకేష్ ఇక్కడ కూడా పారిశ్రామికవేత్తలను కలుసుకొని రోడ్డు షో నిర్వహించారు. ఇతర మంత్రులు ఎవరూ లేకపోవడం కేవలం నారా లోకేష్ మాత్రమే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నారా లోకేష్ ప్రభావం కనిపించేలాగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాల్లో చ‌ర్చ‌ సాగుతోంది.

ఇప్పటికే జాతీయస్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మూడుసార్లు కలుసుకోవడం, కేంద్ర మంత్రులతో తరచూ మాట్లాడుతూ ఉండడం తెలిసిందే. దీనికి తోడు ఇటీవల నేపాల్ లో అల్లర్లు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగి తెలుగువారిని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్ర‌మంలో కేంద్ర మంత్రులతో మాట్లాడడం, నిరంతరం సమీక్షలు చేయటం, రెండు రోజులపాటు అమరావతిలోనే ఉండడం.. వంటి అంశాలు నారా లోకేష్ ను జాతీయస్థాయిలో కీలక నేతగా నిలబెట్టాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా నారా లోకేష్ ప్రభావం కనిపించేలాగా తాజాగా పరిణామాలు మారుతున్నాయి.

ఇది మంచి పరిణామమేనని చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ఇలా అంతర్జాతీయ స్థాయిలో నాయకులను, పరిశ్రమకవేత్తలను, పెట్టుబడిదారులను కలుసుకొని రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలాగా ప్రయత్నాలు చేశారు. ఇదే తరహాలో ఇప్పుడు నారా లోకేష్ కూడా అంతర్జాతీయ స్థాయిలో నాయకుడుగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. నెమ్మది నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించారనేది ఆసక్తికర అంశం. మరి ఇది ముందు ముందు ఆయనను మరింత పుంజుకునేలా చేస్తుందన్నది కూడా నాయకులు చెబుతున్న మాట. దీంతో ఇటు రాష్ట్రంలోను, అటు జాతీయ స్థాయిలోను.. ఇప్పుడు అంత‌ర్జాతీయంగా కూడా నారా లోకేష్ దూకుడు పెంచుతార‌ని అంటున్నారు.