జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి… ఆ తర్వాత రాజకీయాల వైపు వచ్చిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏకంగా సొంతంగానే రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) పేరిట నూతన పార్టీని ప్రకటించిన మల్లన్న.. తన పార్టీ ద్వారా ఇప్పటిదాకా అసెంబ్లీ గడప తొక్కని బీసీ కులాలను ఏకంగా చట్ట సభల్లో కూర్చోబెడతానని సంచలన ప్రకటన చేశారు. ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లన్న… రాజకీయాలపై ఓ రేంజిలో అవగాహన పెంచుకున్నారు. అప్పుడెప్పుడో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్న నాటి అధికార పార్టీ అభ్యర్థిగా నిలిచిన పల్లా రాజేశ్వరరెడ్డిని ఓడిస్తారా? అన్న రేంజిలో సత్తా చాటారు. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయిన మల్లన్న పట్టభద్రులను ఇట్టే ఆకట్టుకున్నారు. అయితే చావుతప్పి కన్నులొట్టటోయినట్లుగా పల్లా స్వల్ప మెజారిటీతో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నారు. మల్లన్నకు తన శక్తి ఏమిటో ఈ ఎన్నికల్లో తెలిసివచ్చినట్టుంది.
ఆ తర్వాత మరింతగా రాజకీయాలపై దృష్టి సారించిన మల్లన్న . బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ సాగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పాలనలో ఓ దఫా ఆయన అరెస్టు కూడా అయ్యారు. అరెస్టు తర్వాత మరింతగా బరిలోకి దిగిన మల్లన్న కాంగ్రెస్ కు దగ్గరగా జరిగారు. పార్టీ అదికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోగలిగారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గ నేతలను బహిరంగ వేదికలపైనే విమర్శిస్తూ సాగిన మల్లన్న… పార్టీతో సస్పెన్షన్ వేటు వేయించుకున్నారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతానన్న మల్లన్న ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates