ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే.. అధికార విపక్షాల మధ్య హోరా హోరీ వాదనలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఇటీవల తెలంగాణలోనూ ఇలాంటి వాతావరణమే కనిపించింది. అధికార పక్షం కాంగ్రెస్… ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ ఎస్ మధ్య తీవ్రస్తాయిలో మాటల యుద్ధం జరిగింది. అంశం ఏదైనా కూడా సభలో ప్రతిపక్షం ఉంటేనే ఒక విధమైన చర్చ సాగుతుంది. కానీ, ఏపీ విషయానికి వస్తే.. మాత్రం గత ఏడాదికాలానికి పైగా సభలు ఏకపక్షంగానే సాగుతున్నాయి.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలే దక్కడంతో `ప్రధాన ప్రతిపక్షం` హోదాపై రగడ సాగుతోంది. దీనిని ఇచ్చేది లేదని అధికార పక్షం భీష్మించింది. కావాల్సిందేనని ప్రతిపక్షం కోరుతోంది. ప్రస్తుతం ఈ విషయంపై ఇరు పక్షాలు కూడా.. ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నాయి. ఒకరైనా తగ్గితే.. సభలో కొంత వరకు మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ, ఆదిశగా సర్కారు కానీ.. ప్రతి పక్షం కానీ. ముందుకు రాకపోవడంతో ఎక్కడి సమస్య అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. వాస్తవానికి తొలి సమావేశాల సమయంలో ప్రమాణ స్వీకారానికి వచ్చిన వైసీపీ నాయకులు తర్వాత కాలంలో వచ్చేందుకు ప్రయత్నించారు.
కానీ, వైసీపీ అధినేత జగన్ మాత్రం సభను బాయికాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్(గత ఏడాది) సమయంలో రైతులకు న్యాయం చేయాలంటూ.. హడావుడి చేశారు. సభకు వెళ్లేందుకు నిరసనగా వచ్చారు. గవర్నర్ ప్రసంగం సమయంలో కాయితాలు చింపి పోశారు. అనంతరం మళ్లీ మామూలే. ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ సభకు వెళ్లడం లేదు.
ఇలా.. ఇరు పక్షాలు కూడా ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. ఇక, గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు సుమారు వారం రోజులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ 15 మాసాల కాలంలో ప్రజలకు చేసిన మంచిని, అమలు చేసిన సంక్షేమాన్ని సభలో అధికార పార్టీ వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా సోషల్ మీడియా నియంత్రణ చట్టం తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అలాగే.. బనకచర్ల ప్రాజెక్టుపై విధివిధానాలను కూడా సభలో చర్చించనున్నారు. జీఎస్టీ తగ్గింపు.. నుంచి పోలవరం, అమరావతి ప్రాజెక్టులపై కూడా సీఎం చంద్రబాబు సభలో కీలక ప్రసంగం చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates