నా గురించి చెబితే.. న‌వ్వుకున్నారు: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో తొలిత‌రం ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు తీసుకువ‌చ్చార‌ని చెప్పారు. అయితే.. ఆత‌ర్వాత‌.. రెండోత‌రం ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను తానే తీసుకువ‌చ్చాన‌ని అన్నారు. అయితే.. ఈ విష‌యం చెబితే న‌వ్వుకుంటున్నార‌ని.. నా గురించి నేను గొప్ప‌గా చెప్పానని అనుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. కానీ.. వాస్త‌వం ఏంటో ఆనాడు ఉన్న నాయ‌కుల‌ను అడిగినా… ప్ర‌స్తుతం అభివృద్ధి ఫ‌లాల‌ను అందుకుంటున్న వారిని అడిగినా చెబుతార‌ని అన్నారు. రెండో త‌రం ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు వ‌చ్చిన త‌ర్వాత‌.. డిజిట‌ల్ యుగం ప్రారంభ‌మైంద‌న్నారు.

తాజాగా వివాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన  గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ వ్యాపార స‌దస్సులో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. ఈ కార్య‌క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండో త‌రం ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకువ‌చ్చిన త‌ర్వాత‌.. డిజిట‌ల్‌గా దేశం, రాష్ట్రం కూడా అభివృద్ధిలో ప‌రుగులు పెడుతున్నాయ‌ని తెలిపారు. ముఖ్యంగా టెలికం రంగంలో అనేక సంస్క‌ర‌ణ‌లు వ‌చ్చాయ‌న్నారు. విద్యుత్ రంగంలో తాను సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చానని.. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఈ సంస్క‌ర‌ణ‌లు అమ‌ల‌వుతున్నాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. పెర‌టి చెట్టు వైద్యానికి ప‌నికిరాద‌న్న సామెత‌గా కొంద‌రు తాను చేసిన సూచ‌న‌ల‌ను న‌వ్వార‌ని వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ దేశానికి ల‌భించిన వ‌ర‌మ‌ని.. ఆయ‌న‌గొప్ప నాయ‌కుడని సీఎం చంద్ర‌బాబు కొనియాడారు. 2047 నాటికి మోడీ తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగా దేశం పురోభివృద్ధిలో ప‌య‌నిస్తుంద‌ని చెప్పారు. ఆర్థికంగా ప్ర‌పంచం లోనే తొలిస్థానానికి దేశం చేరుతుంద‌న్నారు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం అవ‌సరం లేద‌ని వ్యాఖ్యానించారు. తాను విజ్ఞానాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్టు చెప్పారు. త‌ద్వారా సంప‌ద సృష్టి జ‌రుగుతోంద‌ని సీఎం చెప్పారు. 2047 నాటికి భారత్ స‌హా ఏపీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని, దీనికి నాలెడ్జే కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ ఈ దేశానికే మార్గ‌ద‌ర్శిగా మారుతుంద‌న్నారు.

శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ముఖ్యంగా పెట్టుబ‌డులువ‌చ్చేందుకు శాంతి భ‌ద్ర‌త‌లు కీల‌క‌మ‌న్న ఆయ‌న‌.. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నామ‌ని.. ఈ విష‌యంపై పోలీసుల‌కు కూడా దిశానిర్దేశం చేశామన్నారు. ఈ స‌మ‌యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను సైతం సీఎం చంద్ర‌బాబు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఒక మ‌హిళ‌గానే కాకుండా.. దేశ ఆర్థిక మంత్రిగా నిర్మ‌లా సీతారామ‌న్‌.. కీల‌క భూమిక పోషిస్తున్నార‌ని చెప్పారు. దేశంలో గ‌త ప‌దేళ్లుగా ఆర్థిక మంత్రిగా ఉన్న ఘ‌న‌త ఆమెకే ద‌క్కింద‌న్నారు. సంపద సృష్టి కోసం మంచి ప్రభుత్వ విధానాలు ఉండేలా మార్పులు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ఆమెకు సూచించారు.