రాజకీయాల్లో అవసరం ఉంటే ఒకవిధంగా ఉంటారు.. అవసరం తీరాక మరో విధంగా ఉంటారు.. అనేది వాస్తవం. ఈ విషయంలో బీజేపీ నాయకత్వం మరింత ఎక్కువగా ఉంటుంది. తమ అవసరాలకు.. ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పొత్తులు పెట్టుకుని.. తర్వాత.. తమ ఇష్టప్రకారం వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక, తమ అవసరానికి వాడుకుని.. వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో వైసీపీకి అర్థం కావాల్సింది.. బీజేపీ రాజకీయం.
బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. తన అవసరం ముందు.. అనే ఫార్ములాను ఫాలో అవుతుంది. తాజాగా వైసీపీ పాలనపై బీజేపీ జాతీయ చీఫ్.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి జరిగిందన్నారు. అక్రమాలు చేశారని కూడా చెప్పారు. కట్ చేస్తే.. వాస్తవానికి టీడీపీ నేరుగా బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీ. కానీ, ఇదేసమయంలో వైసీపీ పరోక్షంగా తెరచాటున బీజేపీని సమర్థిస్తున్న పార్టీ. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక బిల్లులను వైసీపీ పాసయ్యేలా సహకరించింది.
గతం చూసినా.. వర్తమానం చూసినా.. బీజేపీ అడుగులకు మడుగులు అద్దుతోందన్నది నిర్వివాదాంశం. గతంలో రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. ఈ సమయంలో అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డిద్వారా జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఏ బిల్లు తెచ్చినా మద్దతిచ్చారు. చివరకు రైతు పక్షపాతి అను చెప్పుకొనే.. జగ న్.. కేంద్రంలోని మోడీ సర్కారు రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు తెచ్చినప్పుడు(తర్వాత రద్దయ్యాయి.) వాటికి కూడా మద్దతు ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు కూడా మద్దతిచ్చారు. ఎటొచ్చీ.. వక్ఫ్ బోర్డుకు మాత్రం ఇవ్వలేదు.
మిగిలిన వాటికి అన్నింటికీ.. ఎన్డీయే మిత్రపక్షాల కన్నా కూడా ముందే.. జగన్ బీజేపీకి మద్దతు తెలిపారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ.. వైసీపీ ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు తెలిపింది. మరి ఇంత చేస్తే మాత్రం ఏమైంది? పట్టుమని పది రోజులు కూడా తిరగకుండానే.. కేంద్ర మంత్రి నేరుగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి పుట్టగతులు కూడా ఉండబోవని వ్యాఖ్యానించారు. సో.. దీనిని బట్టి జగన్ మార్పు దిశగా అడుగులు వేయాలని అంటున్నారు ఆ పార్టీ నేతలు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates