దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలకు.. భక్తులు తరచుగా విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. ఏపీలో అయితే తిరుమల, సింహాచలం, విజయవాడ దుర్గమ్మ, తెలంగాణలోఅయితే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి.. ఇలా.. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలకు భక్తులు విరివిగా విరాళాలు ఇస్తారు. ఆ సొమ్ముతో దేవాలయాలు.. వివిధ కార్యక్రమాలు చేస్తుంటాయి. భక్తుల సౌకర్యం కోసం.. కల్యాణ మండపాలు.. క్యూలైన్ల ఏర్పాట్లు.. తాగునీటి వసతులు.. భోజన సదుపాయాలు కూడా కల్పిస్తాయి. అదేసమయంలో వివిధ ప్రాంతాల్లో మరిన్ని ఆలయాలు కూడా నిర్మిస్తాయి.
అయితే.. తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. “భక్తులు ఇచ్చిన సొమ్మును భగవంతుడి కైంకర్యానికే తప్ప.. ఇతర అవసరాల కోసం కాదు.“ అని తేల్చి చెప్పింది. “భగవంతుడిపై భక్తితో ఒక్క రూపాయి అయినా.. ఇస్తున్నారంటే అది వారి కష్టార్జితం. కేవలం భగవంతుడికి చెందాలనే ఈ నిర్ణయం తీసుకుని.. వారు అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుని విరాళాలు ఇస్తారు. అలాంటిది.. భక్తులు ఇచ్చిన సొమ్మును మీరు వేరే వాటికి ఎలా ఖర్చు చేస్తారు? అసలు కల్యాణ మండపాలు నిర్మించేందుకు ఆ సొమ్ములను ఎలా వెచ్చిస్తారు?“ అని సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది. అలా చేయడానికి వీల్లేదని.. భక్తులు ఇచ్చిన విరాళం.. భగవంతుడికే చెందాలి తప్ప.. మౌలిక సదుపాయాలకు(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) కాదని తేల్చి చెప్పింది.
ఏంటి వివాదం..?
తమిళనాడు అంటేనే దేవాలయాల రాష్ట్రంగా పేరొందింది. ఆ రాష్ట్రంలోని ఐదు ఆలయాలకు చెందిన నిధులతో రాష్ట్రంలోని వివిధ ఆలయాల ప్రాంగణాల్లో కల్యాణ మండపాలను నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని మద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. తమిళనాడు ప్రబుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భగవంతుడు అంటే.. వేరే ఎవరో కాదని.. దైవం మానుష రూపంలో ఉన్నాడని భావిస్తామని.. ప్రభుత్వం తరఫున న్యాయవాది పేర్కొన్నారు. అందుకే మానవ కల్యాణం కోసం.. కల్యాణ మండపాలు నిర్మిస్తే తప్పులేదన్నారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కల్యాణ మండపాల ఏర్పాటు కోసం భక్తులు తమ డబ్బును ఆలయాలకు ఇవ్వరు.“ అని వ్యాఖ్యానించారు. భక్తులు కేవలం భగవద్ కైంకర్యాలకు మాత్రమే ఇస్తారు తప్ప.. కల్యాణ్ మండపాల కోసం.. మరేదో ఇతర అవసరాల కోసం కాదని వ్యాఖ్యానించింది. ఇది.. సర్కారు బాధ్యత అని పేర్కొంది. “ఒక ఆలయ ప్రాంగణంలో పెళ్లి జరుగుతుంటే.. అక్కడ అసభ్యకరమైన పాటలు ప్లే చేస్తుంటే.. అది సరైనదేనా?’’ అని ప్రశ్నించింది. అసలు దేవుడి సొమ్మును ఎలా ఖర్చు చేయాలో.. ప్రభుత్వాలకు సంబంధం ఏంటి? రాజకీయేతరంగా ఏర్పాటు అయ్యే .. కమిటీలు, పాలకమండళ్లు నిర్ణయిస్తాయని తెలిపింది. దీనిపై పూర్తి తీర్పు ఈ నెల 19న రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates