మోడీకి కుటుంబం లేదు.. స్నేహితులు లేరు: మ‌హిళా నేత వ్యాఖ్య‌లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గురించి ఎవ‌రు మాట్లాడినా.. ఆయ‌న ఈ దేశానికి చేసిన సేవ‌తోపాటు.. 11 ఏళ్లుగా ఆయ‌న ప్ర‌ధానిగా ఉన్న తీరును, చేసిన ప‌నుల‌ను ప్ర‌స్తావిస్తారు. ఎవ‌రూ కూడా ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని స్పృశించే సాహ‌సం చేయ‌రు. కేంద్రంలో ఎంతో చ‌నువుగా ఉండే మంత్రులు జేపీ న‌డ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటివారు కూడా.. ఎప్పుడూ మోడీకి సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాలు, ఆయన కుటుంబం గురించి.. ఎవ‌రూ మాట్లాడ‌రు. మోడీ కూడా.. ఒక్క‌త‌న త‌ల్లి.. ఎప్ప‌డైనా అవ‌స‌రం అనుకుంటే.. త‌న అన్న గురించి మాత్ర‌మే మాట్లాడ‌తారు.

అయితే.. తాజాగా మోడీకి సంబంధించిన ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయ‌కురాలు స్మృతి ఇరానీ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోడీకి కుటుంబం అంటూ ఏమీలేద‌న్నారు. అంతేకాదు.. అస‌లు మోడీతో అనుబంధం ఏర్పాటు చేసుకున్న స్నేహితులు కూడా ఎవ‌రూ లేర‌న్నారు. “ఒక వేళ ఎవ‌రైనా.. మోడీకి నేను చాలా ద‌గ్గ‌ర‌ అని చెప్పుకొంటే.. అది త‌ప్పు. అస‌లు మోడీకి ఎలాంటి అనుబంధం.. బంధం లేదు. ఆయ‌నే ఈ దేశం కోసం అన్నీ వ‌దులుకున్నారు. ఆయ‌న ఈ దేశ‌మాత‌కు పెద్ద‌బిడ్డ‌.“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మోడీకి స్నేహితులమ‌ని చాలా మంది చెప్పుకొంటార‌ని అన్నారు.

కానీ, వారిలోనూ నిజాయితీ లేద‌ని స్మృతి ఇరానీ చెప్పారు. దేశంపై ప్రేమతో త‌న కుటుంబాన్ని.. త‌న బంధువుల‌నే కాదు.. స్నేహితుల‌ను కూడా మోడీ వ‌దిలేసి వ‌చ్చారని.. సుదీర్ఘ‌కాలంగా ఆయ‌న ప్ర‌జాజీవితంలోనే ఉన్నార‌ని.. గుజ‌రాత్ ను ఎలా డెవ‌ల‌ప్ చేశారో అంద‌రికీ తెలిసిందేన‌ని స్మృతి ఇరానీ అన్నారు. అలాంటి నాయ‌కుడికి ఎలాంటి అనుబంధాలు ఉండ‌బోవ‌మ‌ని అన్నారు. కానీ, ఒక పేరు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒక స్థాయికి వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంద‌రు అలానే చెప్పుకొంటార‌ని.. మోడీని త‌మ వాడిగా ప్ర‌చారం చేసుకుంటార‌ని.. కానీ, అది పూర్తిగా నిరాధారం.. అబ‌ద్ధం.. అస‌త్యం అంటూ.. ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్మృతి ఇరానీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

బీజేపీలో చ‌ర్చ‌!

కాగా.. స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్య‌లు బీజేపీలో చ‌ర్చ‌కు దారితీశాయి. ఆమె అక్క‌సుతో అన్నారా? లేక నిజంగానే మోడీని ప్ర‌శంసించాల‌ని వ్యాఖ్యానించారా? అనే విష‌యంపై ఆమె చేసిన వ్యాఖ్య‌ల వెనుక ఉన్న మ‌ర్మంపై నాయ‌కులు దృష్టి పెట్టారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో స్మృతి ఇరానీకి టికెట్ ఇప్పించ‌డం నుంచి ఆమెకు.. కేంద్రంలో ప‌ద‌వులు ఇప్పించే దాకా కూడా.. మోడీఆమెను చేయి ప‌ట్టుకుని న‌డిపించారు. 2019లో విజ‌యం ద‌క్కించుకున్న ఆమె.. గ‌త ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో ఆమెను మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌ని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో ఆమె బీజేపీ కార్య‌క్ర‌మాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల సీరియ‌ళ్ల‌లో కూడా న‌డిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మోడీపై ఆమె ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.