రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అన్నదాతలకు ఇబ్బందిగా మారిన అంశం, ప్రభుత్వాలను ఇరుకున పెడుతున్న అంశం యూరియా. ఇతర దేశాల నుంచి దిగుమతి కావాల్సిన యూరియా వ్యవహారం సంకటంలో పడింది. దీంతో కేంద్రం కూడా ఆచి తూచి రాష్ట్రాలకు యూరియాను సర్దుబాటు చేస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కావాల్సిన మేరకు యూరియా లభించడం లేదన్నది వాస్తవం. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చేతులు ఎత్తేసిందన్న టాక్ వినిపిస్తోంది.
ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం జాగ్రత్తలు పడుతోంది. కానీ పరిస్థితి మాత్రం ఏమాత్రం అదుపులో లేదు. రైతులు గంటల తరబడి కాదు, రోజుల తరబడి లైన్లలో వేచి ఉంటున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం చంద్రబాబు ఏమనుకున్నారో ఏమో, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అసలు ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదన్న వాదన కూడా వినిపిస్తోంది. కానీ ప్రస్తావించారు, కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయి.
ఏమన్నారంటే…
యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో సోమవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా యూరియా విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉండడం, రైతులు ఇబ్బందులు పడుతుండడం, ప్రభుత్వం యూరియాను అందించలేక చతికిల పడుతుందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఇలా యూరియాతో క్యాన్సర్ వస్తుందని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.
అంతేకాదు, యూరియా వాడకం తగ్గించే విషయంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని కూడా చంద్రబాబు సూచించారు. ఏపీలో క్యాన్సర్ టాప్ 5 రోగాల జాబితాలో ఉందని ఆయన, యూరియా వాడకం తగ్గించకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు. అవసరమైతే రైతులకు మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలన్నారు. అంటే కిలోల లెక్కన ఇవ్వాలని సూచించారు.
ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్ అయ్యాయి. రైతు సంఘాల నుంచి రైతుల వరకు చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. “క్యాన్సర్ వస్తుందని అన్నప్పడు అసలు పంపిణీనే ఆపేసి ప్రత్యామ్నాయం చూపించవచ్చు కదా!” అని వారు ప్రశ్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates