రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, యూట్యూబ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే, ఈ విషయంలో ఎదురు దాడి చేసేందుకు, తిప్పికొట్టేందుకు చాలా మంది నాయకులు వెనకబడుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంపై తాజాగా ఆదివారం జరిగిన పార్టీ నాయకుల అంతర్గత సమావేశంలో చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో భారీ ఎత్తున జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ముందు వెనుకబడిందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు, నిరంతరం తనే ఎదురు దాడి చేయాల్సి వస్తోందని, దీనివల్ల రోజుకు కనీసం నాలుగు గంటల పాటు సమయం వెచ్చించాల్సి వస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి చంద్రబాబు రోజుకు 18 గంటలు పని చేస్తారని పేరు ఉంది. ఇటీవల కాలంలో ఆయన ఒక్కోసారి 20 గంటలు పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే గడిచిన ఆరు మాసాల నుంచి వైసిపి సోషల్ మీడియా సహా ఇతర మాధ్యమాల్లో వస్తున్న వ్యతిరేక అంశాలు, వ్యతిరేక ప్రచారం వంటివి ఎదుర్కొనేందుకు చంద్రబాబు కనీసం రోజుకు నాలుగు గంటల పాటు కసరత్తు చేస్తున్నారనేది వాస్తవం. వైసిపి చేస్తున్న విమర్శలను తెలుసుకోవడం, వాటికి కౌంటర్‌గా స్క్రిప్ట్‌ను తయారు చేసుకోవడం, దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటివి సమయాన్ని హరిస్తున్నాయని ఆయన చెబుతున్నారు. నాయకులే సిద్ధమై రోడ్లమీదకి వస్తే లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తనకు సమయం సేవ్ అవుతుందని చెబుతున్నారు.
దీంతో మరింత ఎక్కువ సమయం తాను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టి పనిచేసేందుకు అవకాశం ఉంటుందన్నది చంద్రబాబు చెబుతున్న మాట. “మీరందరూ మౌనంగా ఉంటే నేనే జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల రోజుకు నాలుగు గంటల పాటు నాకు టైం వేస్ట్ అవుతుంది” అని తాజాగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
వైసిపి అనుకూల సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో జరుగుతున్న చర్చల విషయానికి వస్తే రైతుల అంశాన్ని ప్రధానంగా వారు చర్చిస్తున్నారు. అలాగే అమరావతి రాజధానిలో నీళ్లు నిలవడం, కేంద్రం నుంచి సరైన విధంగా సహాయం అందకపోవడం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఆయా అంశాలపై బలంగా వాదన వినిపిస్తున్నారు. వీటికి తోడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతోంది.
దీనిని అరికట్టేందుకు, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు చంద్రబాబు తనవంతు ప్రయత్నంగా అనేక అంశాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల తన సమయం అంతా పోతుందని ఆయన చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వైసిపి చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై బలమైన గళం వినిపిస్తే, తాను ఇతర అంశాలపై జోక్యం చేసుకునేందుకు, ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు సమయం ఉంటుందని చెప్పారు. “మీరందరూ మౌనంగా ఉండటం వల్ల నేను ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది” అన్నది ఆయన చెబుతున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates